బంగారునగరం ’జైసల్మేర్‘

రాజస్థాన్ బంగారు నగరంగా జైసల్మేర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చారిత్రక భారతదేశం యొక్క అనుభవాలను పొందాలంటే ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలి. పుస్తకాల్లో చదువుకునే చరిత్ర, రాజసం మన ఊహల్లో ఎంత బాగుంటుందో ఈ ప్రదేశం అదే అనుభవాన్ని ప్రతి ఒక్కరికీ అందిస్తుంది. జైసల్మేర్ వెళ్లే వారు ఆసక్తికర అనుభవాలను పొందాలనుకుంటే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మీరు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ గోల్డెన్ సిటీని చుట్టి వచ్చేందుకు టిక్కెట్లు కూడా ముందే బుక్ చేసుకోవడం మంచిది.

​బంగారు కోటలో నివసించండి

జైసల్మేర్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ సిఫార్సు చేసే ముఖ్యమైన పర్యాటక ప్రాంతం ‘బంగారు జైసెల్మేర్ కోట’. ఈ కోటలో నివసించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. భారతదేశంలోని ఇతర కోటల మాదిరిగా కాకుండా ఈ కోట నివాసానికి ఇప్పటికీ అందుబాటులో ఉండడం విశేషం. దాదాపు 300 మంది వరకూ ఈ కోటలో నివాసం ఉంటారు. రాజుల కాలం నాటి అనుభవాలను, మర్యాదలను టూరిస్టులు ఇక్కడ నివసించడం ద్వారా పొందవచ్చు. ఖిల్లా భవన్ లో నివాసం కూడా ఇక్కడ మరో ఎంపిక. ఇందులో మొత్తం 8 వారసత్వ గదులు ఉంటాయి. కాబట్టి వీటిని మీరు ముందే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇసుక దిబ్బలపై క్యాంప్స్

జైసల్మేర్ లో అత్యుత్తమ అనుభవాలను అందించే ముఖ్యమైన పనుల్లో శిబిరాల్లో నివాసం ఒకటి. ఇసుక దిబ్బలపై ఏర్పాటు చేసే ఈ బస పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. జైసల్మేర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని ఎడారి ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో విలాసవంతమైన, మధ్య తరహా క్యాంప్స్ కూడా ఉంటాయి. రాత్రి వేళ మృదువైన ఎడారి ఇసుక నేలల్లో మీ కాళ్లను ఉంచి విశాలమైన ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ అద్భుతమైన సమయం గడపడం మీరేప్పటికీ మర్చిపోలేరు.

సిల్క్ రూట్ ఆర్ట్ గ్యాలరీ

జైసల్మేర్ లోని పట్వా హవేలి రోడ్డులో దాగి ఉన్న అద్భుతమైన ప్రదేశం సిల్క్ రూట్ ఆర్ట్ గ్యాలరీ. షాపింగ్ పట్ల ఆసక్తి గల వారికి ఇది సరైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ అద్భుతమైన హస్తకళలు, సాంప్రదాయ పాదరక్షలు వంటి ఎన్నో రకాల ఆకర్షణీయమైన వస్తువులు అందుబాటులో ఉంటాయి. జైసల్మేర్ లో టూరిస్టులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను జైసల్మేర్ సందర్శనకు గుర్తుగా కొనుగోలు చేసి ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

మఖనియా లస్సీ, ఘోతువా లడ్డూ

లస్సీ మీకు ఇష్టమైన పదార్ధం అయితే జైసల్మేర్ లోని మఖనియా లస్సీ అన్నింటి కంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది. క్యాలరీల గురించి మీరు లెక్కించకపోతే మాత్రం మఖనియా లస్సీ సాధారణ గ్లాస్ ల కంటే చాలా ఎక్కువ మోతాదులో చిక్కగా డ్రైఫ్రూట్స్ తో నిండి ఎంతో రుచికరంగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మరో రుచికరమైన తీపి పదార్ధం ఘోతువా లడ్డూ. జైసల్మేర్ లో దీనిని అస్సలు మిస్ కాకండి. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ తియ్యని లడ్డూ రుచిని మీరు ప్రశంసించకుండా ఉండలేరు. ధన్ రాజ్ రన్మల్ భాటియా స్వీట్ షాప్ లో ఈ లడ్డూల రుచి ప్రత్యేకంగా చెబుతారు.

​థార్ వద్ద పారాసైలింగ్

    జైసల్మేర్ లో పారాసైలింగ్ సాహసాల పట్ల అభిరుచి గల వారికి ఒక గొప్ప ఎంపిక. జైసల్మేర్ లో బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుకలపై నుంచి ఆకాశంలోకి పారాసైలింగ్ ద్వారా ఎగరడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. థార్ ఎడారి యొక్క అద్భుతమైన దృశ్యాలను ఇక్కడి నుంచి చూడవచ్చు. దీని కోసం లైసెన్స్ కలిగిన బోధకుని కోసం, టూర్ నిర్వాహకుడి కోసం అన్వేషించండి. ఇది మీ పర్యటనలో ఓ గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది.

​గడ్సిసర్ సరస్సులో ప్రయాణం

పెయింటింగ్ లలో సరస్సుల వద్ద అద్భుతంగా కనిపించే సూర్యాస్తమయ దృశ్యాలను నేరుగా వీక్షించాలనుకుంటే గడ్సిసర్ సరస్సులో ఫెర్రీ ప్రయాణం చేయాల్సిందే. మోటార్ బోట్లను ఈ ప్రయాణం కోసం టూరిస్టులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. ఇదివరకు చూడని అద్భుతమైన దృశ్యాలను ఈ ప్రయాణం మీకందిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కేవలం వీటిని మీ కళ్లకే పరిమితం చేయకుండా ఎప్పటికీ నెమరువేసుకునేందుకు వీలుగా మీ వెంట ఓ కెమెరాను కూడా తీసుకువెళ్లండి.