ఆరోగ్యానికి మేలైన మిరియాలు

   

మిరియాలు రుచికి ఘాటుగా, కారంగా ఉంటాయి. ఆయుర్వేదంలో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. వివిధ వ్యాధుల నివారణకు ఇవి తోడ్పడతాయి. వీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మిరియాల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, పీచు, కాల్షియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు కూడా ఉంటాయి. ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం. వీటిని కింగ్‌ ఆఫ్‌ స్పైసీస్‌గా అభివర్ణించారు. మిరియాల్లోని పిపరైన్‌, చావిసైన్‌‌లు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. కేవలం జలుబు, దగ్గుకు మాత్రమే కాదు జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు సహాయపడతాయి.

లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న అపాన వాయువులను బయటకు పంపిస్తాయి. రక్త ప్రసరణను వేగవంతం చేసి, కొవ్వు పేరుకుపోకోకుండా చేస్తాయి. స్వేద గ్రంథుల పనితీరు మెరుగుపడి, మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. అధిక బరువు, కీళ్లవాతం, గ్యాస్ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. మిరియాల పొడి, నెయ్యి కలిపి రాస్తే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

మిరియాలు ఇలా తీసుకుంటే...

  • మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. గాయాలపై మిరియాల పొడిని పూస్తే యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి రక్తస్రావాన్ని అరికడుతుంది.
  • దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాలు, శొంఠి పొడిచేసి, తేనె కలిపి రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం ఉంటుంది.
  • గొంతులో గరగరగా ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి, ఒక చెంచా తేనె కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతాయి.
  • మిరియాలు తింటే కడుపులో మంటగా ఉన్నా చర్మంపై వచ్చే తెల్లటి మచ్చల్ని తగ్గించడానికి తోడ్పడుతాయని పరిశోధనలో తేలింది. చర్మంపై ఏర్పడే బొల్లి మచ్చల్ని మిరియాలు తగ్గిస్తాయని లండన్‌ కింగ్స్‌ కాలేజీ పరిశోధనలో వెల్లడయ్యింది. మిరియాలకు ఘాటును అందించే ‘పైపెరైన్‌‘ అనే రసాయనం చర్మ కణాల్ని ప్రేరేపించటం ద్వారా రంగు వచ్చేలా చేస్తుందని ఈ పరిశోధనలో గుర్తించారు.

మిరియాల కషాయం

  • ఈ కషాయం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • మిరియాలు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • జీర్ణశక్తిని పెంచుతుంది 
  • దంత క్షయాన్ని నివారిస్తుంది.
  • శరీర కణజాల నిర్మాణానికి సాయపడుడుతుంది.
  •  చర్మం కాలేయం ఊపిరితిత్తుల ఇబ్బందులు రాకుండా చూస్తుంది.
  •  ఈ కషాయం జలుబు దగ్గు ఆయాసం జ్వరం వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.