సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు మన పెద్దలు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో చెప్పుకున్నారు. సూర్యుడు పుష్యమి నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కార్తెను పుష్యమి కార్తె అన్నారు. పుష్యమి కార్తె గురించి రైతులు చెప్పిన సామెతలు. జూలై 20 నుంచి పుష్యమికార్తె ప్రారంభం.
- పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
- పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు
పుష్యమి కార్తెలో రైతులు చేయవలసిన పనులు
- వరి : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
- జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట, సస్యరక్షణ.
- మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ.
- కొర్ర : విత్తనం వేయుట.
- మిరప : నాట్లకు భూమి తయారు చేయుట.
- పొగాకు : నారుమళ్లు తయారు చేయుట.
- పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు.
- వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి.
- పశువులు : దొమ్మ, పారుడు, గురక, గాలికుంటు మరియు యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు.