ఆషాడమాసం దాన ధర్మాలకు ప్రసిద్ధి.. ఈ ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్య రోజున ఎన్నో రకాల పూజలు, నోములు ఆచరిస్తుంటారు. ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాల కథనం. కనుక ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా.. వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట. దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిది. ఈ ఆషాడ అమావాస్యనే ‘చుక్కల అమావాస్య‘ అని కూడా పిలుస్తారు.
అమావాస్య గౌరీ పూజ
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా శుభాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం.. కనుక ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ.. మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజిస్తారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసి.. అనంతరం రక్షను ధరిస్తే.. పెళ్ళికాని అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం.
చుక్కల అమావాస్య పూజ
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు… కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఇందుకోసం గౌరీపూజని చేసి.. సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని నమ్మకం.