వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ, ద‌శావ‌తార మండపంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

మొదటిరోజు...

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు.

చతుర్వేద పారాయణం

వసంత, కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మీ మండపం 

శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస పండ్ల, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, ఆర్కుట్‌, కార్నస్‌ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 4 టన్నుల ఫలాలు, 3 టన్నుల‌ సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్‌ ఫ్లవర్లు ఉపయోగించారు. 

రెండవరోజు...

శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన బుధవారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

అశ్వవాహనం...

బుధవారం సాయంత్రం శ్రీ స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో హరికథ, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.