ముగిసిన కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన బుధ‌వారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న‌సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

అంతకుముందు సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.



వైభవంగా త్రిశూలస్నానం

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం త్రిశూలస్నానం ఏకాంతంగా జరిగింది.

అంతకుముందు ఉదయం శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిగింది. ఆ తరువాత అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి స‌మేత శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారికి, స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఇందులో భాగంగా పంచామృతాలు, సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

ధ్వజావరోహణం...

సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కాగా రాత్రి 8 నుండి 9 గంటల వరకు రావణాసుర వాహనం ఆస్థానం కన్నులపండువగా జరిగింది.

హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడి వాహనంపై స్వామివారికి ఆస్థానం నిర్వహించారు.