తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం 6.30 గంటల నుండి ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
ధ్వజస్తంభానికి విశేష అభిషేకం
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఆలయంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు.