అంగరంగ వైభవంగా సాగుతున్న కళ్యాణ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఈ నెల 19 ఆదివారం ఉదయం 9 నుండి 9.20 గంటల మధ్య మీన‌లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్ -19 నిబంధనల మేరకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.

ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అనంత‌, గ‌రుడ‌, విష్వక్సేనుల వారిని, గ‌రుడ ప‌టాన్ని ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగింపుగా ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. వేద మంత్రాల న‌డుమ ధ్వ‌జ‌స్తంభానికి పూజ‌లు చేశారు. అనంత‌రం మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శ్రీ శేషాచార్యులు కంకణబట్టార్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఫిబ్రవరి 24న గ‌రుడ‌సేవ జ‌రుగ‌నుంది. ఫిబ్రవరి 28న ధ్వ‌జావ‌రోహ‌ణంతో ఈ ఉత్స‌వాలు ముగుస్తాయి. 

భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూలు

ఈ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 9 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూల‌ను శ్రీనివాసమంగాపురం ఆల‌యంలో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. రోజుకు 5 వేల చొప్పున ల‌డ్డూలను భ‌క్తుల‌కు విక్రయిస్తున్నారు.

రెండోరోజు...

రెండవరోజు సోమవారం పెద్దశేషవాహన సేవ, సాయంత్రం చిన్నశేష వాహన సేవలు నిర్వహించారు. 

మూడోరోజు...

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీనివాసుడు యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని సింహ వాహనం ద్వారా శ్రీవారు ప్రభోధిస్తున్నారు.

మంగవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై అభయమిచ్చారు. ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్ప మూడో రోజు రాత్రి ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు.  

మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.