ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని జన్మదినం రథ సప్తమి

పరమ పవిత్రమైన మాఘమాసంలో శుద్ధ సప్తమి అనగా రథసప్తమి రోజున  ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తి  జన్మదినంగా పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యభగవానునికి అనేక ఉపాసనా విధానాలు వున్నాయి. సూర్యుని మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదించి, వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమేగాక, జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు.  అంతేకాదు .. మనం కాలాన్ని గుర్తించేది .. సూర్య గమనాన్ననుసరించే.  ఒక పగలు, ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా.  అన్నింటికన్నా ముఖ్యమైనది .. భూమి మీద వున్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆ సూర్యభగవానుడు మనకు ప్రసాదిస్తాడు. ఫిబ్రవరి నెల 8వ తేదీన రథసప్తమి జరుపుకోబోతున్నాం. ఆ రోజున రాష్ట్రంలోని సూర్యదేవాలయాలన్నింటిలోనూ విశేష మైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమిరోజున స్వామివారికి వాహనసేవలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 

రథసప్తమి స్నానం విశేషం

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే ఆచరించే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. రోజూ చేయలేనివారు కనీసం ప్రముఖ దినాలైన రథసప్తమి, మాఘ పౌర్ణమి, శివరాత్రి రోజుల్లో అయినా నదిలో, చెరువు,లో, ఎవరు వీలునుబట్టి వారు స్నానం చేసినా ఎంతో పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. రథసప్తమిరోజున తలమీద, భుజాలమీద జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని తెలిసీ తెలియక చేసిన పాపాలు ఈ స్నానంతో తొలగిపోవాలని ప్రార్ధిస్తూ స్నానం చేస్తారు.  కొందరు చిక్కుడు ఆకులు, రేగు పళ్లు కూడా పెట్టుకుంటారు. ఉదయం తులశమ్మ దగ్గర సూర్యుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు, మున్నగు దేవతలకి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు.  రెండు చిక్కుడు కాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పుల్లలు గుచ్చి, వాటిని సూర్య రధాలుగా భావించి చిక్కుడు ఆకులమీద వుంచి పూజ చేస్తారు.  గొబ్బి పిడకలతో చేసిన పొయ్యిమీద పాలు పొంగించి క్షీరాన్నం వండి,  చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్వని దేవతలు వగైరా దేవతలకు విడి విడిగా నైవేద్యం పెట్టి తామూ ప్రసాదం తీసుకుంటారు.  పిడకలమీద వండిన ఆ పరమాన్నం చాలా రుచిగా వుంటుంది.

ఆదివారాలన్నీ విశేషమైనవే...

మాఘ మాసంలో రధ సప్తమే కాదు, సూర్యునికి ముఖ్యమైన ఆదివారాలన్నీ కూడా విశేషమైనవే.  ఏ కారణంవల్లనైనా రధసప్తమినాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు మాఘ ఆదివారంనాడు చేస్తారు.  అంతేకాదు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశేషమైనదే. 

సూర్యుడు నమస్కార ప్రియుడు...

ప్రతిరోజూ స్నానం అయిన తరువాత సూర్యునికి మనఃపూర్వకంగా నమస్కరిస్తే చాలు ఆయన మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదయంనుంచి అస్తమయం వరకూ (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు.  మనకి అన్ని విధాలా ఇంత మేలు చేస్తున్న ఆ సూర్యనారాయణునికి ఆలయాలు మాత్రం అతి తక్కువ వున్నాయి. 

కోణార్క్ దేవాలయం ప్రధానమైనది...

సూర్య దేవాలయం అనగానే ముందు గుర్తొచ్చేది ఒరిస్సాలోని కోణార్క, గుజరాత్ లోని మధేరా. ఈ రెండు ప్రఖ్యాతి చెందిన ఆలయాలు. అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మన రాష్ట్రంలోవున్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. మనము కూడా మన దగ్గరలో ఉన్న సూర్యభగవానుని రథసప్తమినాడు దర్శించుకుని తరిద్దాం.