కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

సువర్ణముఖీ-కల్యాణీ-భీమా నదుల త్రివేణీ సంగమ పవిత్ర జలాలు ప్రవహించిన పుణ్యభూములకు ఆల వాలం ఈ ప్రాంతం. అగస్త్య మహర్షి వంటి తపోమూర్తుల ఆశ్రమవాటికలకు నిలయం ఈ ప్రాంతం. నూతన వధూవరులైన పద్మావతీ శ్రీనివాసు లిద్దరూ ఇక్కడ విహరించడంవల్ల పావనమైన కల్యాణపురం శ్రీనివాస మంగాపురప్రాంతం. కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శ్రీనివాసమంగాపురంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు.

ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

తిరుమంజన సేవ
కళ్యాణవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన మంగళవారం తిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో వివిధ రకాల సాంప్ర‌దాయ పూలు, రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

కల్పవృక్షవాహనం
శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

సర్వభూపాలవాహనం
రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి కాళీయ‌మ‌ర్ద‌నుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ‌నివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో, తిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.

గరుడోత్సవం
రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.