బలరాముడు బలవంతులందరిలోనూ శ్రేష్టుడు
బలరామావతారము అంటే మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి. శ్రీమహావిష్ణువు యొక్క శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది. బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు.ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు. వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి ... నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము.
భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు.. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్ కర్షణాత్ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు.
బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది.
బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు
గధాయుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. విశేషించి దుర్యోధనుడు, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు. ద్రౌపది వివాహంలోనూ, ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశ సమయంలోనూ శ్రీకృష్ణుడితోపాటుగా బలదేవుడు కూడా ఉన్నాడు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుభద్రను వివాహమాడటంకోసం యతి వేషంలో బలరాముడు దగ్గరకు వెళ్ళాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సహకరించాడు కూడా. కానీ అర్జునుడు సుభద్రను అపహరించి చేపట్టడం బలరాముడికి నచ్చలేదు. అర్జునుడి సాహసాన్ని క్షమించలేనని బలరాముడు తీవ్రంగా కోపగించుకున్నాడు.అయితే శ్రీకృష్ణుడు అతడిని శాంతపరిచి కోపం తగ్గించుకునేలా చేశాడు. పాండవులు వనవాసం చేసే రోజుల్లో తీర్థయాత్రలు చేస్తూ ప్రభాసతీర్థం దగ్గరకు వెళ్ళినప్పుడు బలరాముడు, మరికొందరు యాదవ వీరులను తీసుకొని వారిదగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించాడు. ఆ తర్వాత వనవాసం, అజ్ఞాతవాసం అన్నీ పూర్తికావటం ఉత్తర, అభిమన్యుల వివాహం కూడా జరిగాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలరాముడు పాండవులకు, కౌరవులకు హితకరంగా రాజ్యవిభాగం ఎలా జరిగితే బాగుంటుందో ఆలోచించాలన్నాడు. ఇక్కడే ఇతడికి దుర్యోధనుడంటే అభిమానం ఉందన్న విషయం వ్యక్తమవుతుంది.
కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు
బలరాముడు పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సివారేనని కనుక తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్ఠంగా ఉన్నాడు. ఈ తటస్ఠ లక్షణాన్ని నిలుపుకోవడానికి ఆయన కురుక్షేత్ర యద్ధ సమయంలో సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు. నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధ ధర్మం కాదని తీవ్రంగా తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యకపరిచాడు. అయితే శ్రీకృష్ణుడు కలగజేసుకొని దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం ఉందని, దాంతోపాటుగా భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఉందని గుర్తుచేసి సర్దిచెప్పడంతో కొద్దిగా బాధపడుతూనే రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు.కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కొద్దికాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది. ఓ రోజున బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అరణ్యానికి వెళ్ళారు. అక్కడ బలరాముడు ఓ చెట్టుకింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అప్పుడు ఆయన నోటినుంచి ఒక తెల్లటి సర్పం బయటకు వచ్చి పడమటి సముద్రంలో లీనమైంది. బలరాముడు ఆదిశేషుడి అంశ అని అనడానికి ఇది ఒక నిదర్శనం. శ్రీకృష్ణుడితోపాటే అనేక రాక్షసుల సంహారంలో పాల్గొన్న కృష్ణుడికి అన్నగా, తనదైన ఓ ప్రత్యేకతను బలరాముడు తుదిదాకా నిరూపించుకుంటూనే వచ్చాడు.