లోక సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో టిటిడి నిర్వహిస్తున్న శ్రీ రామ విశ్వ శాంతి యాగంలో భాగంగా 13వ రోజైన శనివారం ఉదయం శ్రీ సీతమ్మవారి విశేష హోమాన్ని 16 మంది వైఖానస పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని పర్యవేక్షణలో శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం – తర్పణ – హోమాదులు మే 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రార్థన మందిరంలో శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 6 లక్షలు, శ్రీ సీతాదేవి మూల మంత్రానుష్ఠానం 6 లక్షలు, శ్రీ లక్ష్మణస్వామివారి మూల మంత్రానుష్ఠానం 7 లక్షలు, శ్రీ ఆంజనేయస్వామివారి మూల మంత్రానుష్ఠానం 7 లక్షల సార్లు జపించి, దీనిలో 10వ వంతు పూర్తికాగానే గో క్షీరంతో తర్పణం నిర్వహించారు. అనంతరం 6 మంది వైఖానస పండితులు రాములవారి హోమగుండమైన అన్వాహరియ హోమగుండంలో శ్రీరామచంద్రమూర్తికి విశేష హోమం నిర్వహించారు. అదేవిధంగా ఇద్దరు వైఖానస పండితులు సీతమ్మవారికి సంబంధించిన పౌండరికాగ్నిలో మూల మంత్ర హోమం, లక్ష్మణ స్వామివారికి మరియు ఆంజనేయ స్వామివారికి నలుగురు వైఖానస పండితులు అహవనీయాగ్ని మూల మంత్ర హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యంత విశేషమైన శ్రీరామ మూల మంత్రం (అస్త్రం), శ్రీ రామ జపం (శస్త్రం), శ్రీ రామ గాయత్రి మంత్రం (రక్షణ) పఠించారు.హోమాన్ని ప్రముఖ పండితులు మరియు టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ నల్లూరి వెంకట మోహనరంగాచార్యులు నిర్వహించారు.
షోడశదిన సుందరకాండ దీక్ష
లోక క్షేమం కొరకు కరోనా వ్యాధి నివారణ, అపమృత్యు దోష నివారణ, సమస్త జనులు ఆయురారోగ్యాలతో ఉండేందుకు వైఖానస భగవత్ శాస్త్రంలో తెలుపబడిన విషూచిక మంత్రానుష్టానంతో షోడశదిన సుందరకాండ దీక్ష నిర్వహిస్తున్నారు. శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహంతో వసంత మండపంలో 16 రోజుల పాటు 16 మంది వేద పండితులతో సుందరకాండ పారాయణం, మరో 16 మంది వైఖానస పండితులు ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జప – తర్పణ – హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ హోమ ప్రక్రియలో కలిగినటువంటి శక్తి పొగ రూపంలో ఆకాశంలో ప్రవేశించి వాయువుతో కలిసి హనుమత్ శక్తిగా మారి, సుందరకాండ పారాయణ ఫలంతో కలిసి ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని వివరించారు.
ఇందులో శుక్రవారం శ్రీరాములవారికి, శనివారం శ్రీ సీతమ్మవారికి విశేష హోమాలు జరిపారు. అదేవిధంగా మే 16న శ్రీ లక్ష్మణ స్వామివారికి, మే 17న శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష హోమాలు, మే 18వ తేదీన పూర్ణాహూతితో జప – తర్పణ – హోమాలు జరుగుతాయి. మే 18వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కుంభ శక్తిని శ్రీరామచంద్రమూర్తికి ప్రోక్షణ చేసి, శ్రీ ఆంజనేయస్వామివారికి 16 రోజుల పాటు ఆరాధింపడిన 16 కలశాలతో విశేష అభిషేకం చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్వీబిసీలో ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 2.30 గంటల వరకు ప్రసారం చేస్తోంది. భక్తులందరు ఓం శ్రీ రామాయనమః, ఓం శ్రీ సీతాయనమః, ఓం శ్రీ లక్ష్మణయనమః, ఓం శ్రీ హనుమతేయ నమః అని ప్రతి మంత్రాన్ని 8 సార్లు పఠించినట్లయితే వారికి శ్రీవారి ఆశీస్సులతో బాధలు తొలగిపోయి, సకలశుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు.