లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో మే 3వ తేదీ నుండి టిటిడి షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమానికి ముందురోజు ఆదివారం రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ఫణ నిర్వహించారు. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్ఫణ నిర్వహించారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో 32 మంది ప్రముఖ పండితులు పాల్గొంటున్నారు. ఇందులో 16 మంది వేద పండితులు ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వహిస్తారు. వసంత మండపంలో మే 3 నుండి ప్రారంభమైన ఈ జపహోమం 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 16 మంది పండితులు సుందరకాండలోని 68 సర్గలను పారాయణం చేయనున్నారు.
ఇందులో పాల్గొనే పండితులు ఒక పూట ఆహారం స్వీకరించి, రెండవ పూట పాలు, పండ్లు స్వీకరిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపై నిద్రిస్తారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజం కోవిడ్ – 19 వ్యాప్తి కారణంగా ఇబ్బందులలో ఉంది. కంటికి కనిపించని వైరస్ అనే శత్రువుతో యుద్ధం చేస్తున్నాము. ఆ యుద్ధంలో విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం సఫలం కావాలంటే పరిపూర్ణమైన దైవాను గ్రహం కావాలి. అందుకోసం టిటిడి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు సుందరకాండ పారాయణం చేస్తూ, ఇందులో భక్తులందరిని భాగస్వాములను చేస్తు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. ఈ విజయాన్ని మరింత సులువు చేసే ప్రయత్నంలో భాగంగా టిటిడి 16 రోజుల పాటు సుందరకాండను దీక్షగా పారాయణం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీవారి సన్నిధిలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష చాలా విశిష్టమైనది. ” రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్ ” అనే వాక్యాన్ని అనుసరించి సీతాపతి అయిన శ్రీరామచంద్రమూర్తి విజయాన్ని ఇచ్చుగాక అనే అర్థం కలిగివుంటుంది. ఈ వాక్యం సంస్కృత బాషకు సంబంధించినది కావున ఇందులోని నియమాల ప్రకారం కటపయాగ సంఖ్యలు పరిగణలోనికి తీసుకుంటే ఒక్కొక్క అక్షరానికి విలువను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా రోజులలో అన్ని సర్గలు పారాయణం చేయనున్నారు.