జిల్లేడు ఆకులు సూర్యునికి ఇష్టమైన పత్రాలు. వీటినే అర్కపత్రములని కూడా వ్యవహరిస్తారు. రథసప్తమి పర్వదినం శిశిరఋతువులో వస్తుంది. శిశిరఋతువుకు ముందు హేమంత ఋతువు, హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉండి శిశిర ఋతువులో రథసప్తమి రోజు నుంచి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం అను కూలించడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పెద్దలు తెలియచేసారు.
ఇలా చేయడం ద్వారా జిల్లేడు ఆకులలో ఉండే ఔషధాలు మన శరీరానికి తాకి ఎలాంటి చర్మవ్యాధులు, అనారోగ్యములు రాకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. అలాగే గోవు పవిత్రమైనది కాబట్టి సంక్రాంతి పండుగ మూడు రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల పైన ఉంచుతారు.
పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటమని వారి విశ్వాసం. అంతేగాక వైద్య పరంగా రేగు పళ్లలో ఆయుర్వేదిక లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇవి తలమీద పోసినప్పుడు శరీరంపై జాలువారుతూ కిందపడతాయి. దాని వల్ల శరీరంపై ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.
సాక్షాత్తూ నారాయణుడు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాలని తింటూ తన తపస్సుని కొనసాగించాడని… దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను పిల్లలపై పోస్తే…సాక్షాత్తు నారాయణుడే దీవించినట్టు అని నమ్మకం. దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి రావడం కూడా ఈ సాప్రదాయం కొనసాగడానికి కారణం.