తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేసి అభిషేకం అనంతరం చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఒక గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం చేశారు.
ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మివ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదలకోసం అనంతపద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాలసముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు.