శ్లో: ధ్యాయామి దేవీం సకలార్ధధాత్రీంచతుర్భుజం కుంకుం రాగాశోనాం
ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే.
కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి
కల్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే
కాత్యాయిని వ్రతము వివాహము కావలసిన కన్యలకు కల్పవృక్షం వంటిది. ఈ వ్రతమును స్వయముగా ఈశ్వరుడు పార్వతీదేవికి తెలియచేసెను అని సూత మహాముని శౌనకాది మహర్షులకు వివరించినారు. వివాహ ప్రతిబంధక దోషములున్నవారికి వాటి నివారణకోసము, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకుగానూ కాత్యాయని వ్రతముతో సాటియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఈ వ్రతమును ఏడు మంగళ వారాలు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. 8వ వారం ఉద్యాపన జరపాలి. ప్రతీ మంగళవారంనాడు సూర్యాస్తమయకాలములో వ్రతాన్ని ఆచరించాలి. పగలంతా పండ్లు పాలుతీసుకుని రాత్రి వ్రతమైన తరువాత భోజనం చేయాలి. ఈ వ్రతాచరణము వల్ల వివాహమునకు ప్రతిబంధకమయిన కుజదోషములు ఇతర ప్రతిబంధక దోషములు నివారణమై శీఘ్రముగా వివాహమై అఖండ సౌభాగ్యముతో తులతూగుతారు.
కాత్యాయిని వ్రత నియమాలు
కాత్యాయిని వ్రతం ప్రారంభించాలనుకున్న మంగళవారము నాడు ఉదయమే మేల్కొని కాలకృత్యములు తీర్చుకొని, భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి, సంకల్పం చేసుకుని, సాయంత్రం వరకూ ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ఆచరించవలెను.
వ్రత విధానము
కాత్యాయిని వ్రతమును ప్రారంభించడానికి ముందుగా ఇంటిలో తూర్పుదిశ ఈశాన్య మూలలో శుభ్రంచేసి, ముగ్గులతో అలంకరించి, ఒక పీటకు పసుపు రాసి, కుంకుమ, వరిపిండితో ముగ్గులు పెట్టి ఆసనమును సిద్ధంచేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఏర్పాటుచేయాలి. సిద్ధంచేసిన ఆసనముపై ముందుగా ఈశ్వర సహితంగా కాత్యాయినీ దేవి చిత్రపటాన్ని గాని, విగ్రహాన్ని గాని ప్రతిష్ఠించాలి. ముందుగా గణపతిపూజచేసి ఆపిదప కలశమును ఏర్పాటుచేసే పాత్రలో సగమువరకూ పవిత్ర జలమును పోసి మామిడి చిగుళ్ళను, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచవలెను. ఆ కలశమునందు పరమేశ్వరుని ఒడిలో కూర్చుని వున్నట్లుగా భావించి కాత్యాయనిదేవిని ఆవాహన చేయాలి. భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో ఆ దేవిని పూజించవలేయును. ఎర్రని పుష్పములు అంటే ఆ కాత్యాయినీ దేవికి ఎంతో ప్రీతి. అంతేకాకుండా ఎరుపు వర్ణం అంటే కుజునికి ప్రీతి కనుక ఆ అమ్మవారిని ఎర్రని పుష్పాలు, పసుపు, కుంకుమలతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకొమ్ముతోగాని వారి వారి శక్త్యానుసారము మంగళ సూత్రమును కలశమునకు అలంకరించవలెను.
పూజ పూర్తయన తరువాత ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని, ఏడు చెరుకుముక్కలను
నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత
సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీద వుంచి పిదప ఆ
అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకోవాలి. ఈ విధంగా వ్రతం యధావిధిగా పూర్తిచేసిన
తరువాత రాత్రి భోజనము చేయవచ్చు. నైవేద్యము పెట్టిన అప్పాలు, చెరుకుముక్కలు వ్రతం
చేసుకున్నవారు తినవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును. మధ్యలో ఏ వారమైన అడ్డంకి వచ్చినచో తరువాతి
వారము జరుపుకోవలెను.
ఉద్యాపనము
ఏడు మంగళవారాలపాటు కాత్యాయిని వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించి ఎనిమిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలయును. ఉద్యాపన ముందురోజు అనగా సోమవారం ముత్తైదువులను పసుపు, కుంకుమ, సున్నిపిండి, కుంకుడుకాయలు ఇచ్చి తమ ఇంటికి ఉద్యాపనకు రమ్మని వారి ఇంటికి వెళ్ళి బొట్టుపెట్టి పిలవాలి. ఉద్యాపనం రోజున ఉదయమునే అమ్మవారిని యధావిధిగా పూజించి, తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువలను పూజించాలి. వచ్చినవారిని వరుసగా ఆసనములపై కూర్చుండబెట్టి వారినే గౌరీదేవిగా భావించి వారిని పసుపు కుంకుమలతో అలంకరించి, పూజించి, ఏడేసి అప్పాలను, ఏడేసి చెరుకుముక్కలను, రవికెలగుడ్డలు, దక్షిణ తాంబూలాలతో వాయనమివ్వాలి. శక్తి ఉన్నవారు చీరలు కూడా ఇవ్వవచ్చును. వాయనం ఇచ్చుకున్న తరువాత వారినుండి ఆశీస్సులు పొంది, వచ్చిన ముత్తైదువలకు ఏదైనా ఒక తీపి పదార్ధముతో పాటు భోజనము పెట్టవలెను. ఈ విధముగా యధావిధిగా, భక్తిప్రపత్తులతో కాత్యాయిని వ్రతమును ఆచరించిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారింపబడి శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.