వైద్యం, మందుల తయారీ వరకే సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం మందుల తయారీలో పరిశోధనల దిశగా ఆలోచన చేస్తోంది. ఇటీవల కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు యుద్ధ ప్రాతిపదికన 5 రకాల మందులు తయారుచేసి వాటిని పంపిణీ చేసిన విధానాన్ని ఆయుష్ శాఖ ప్రశంసించింది. దీంతో సరికొత్త ఫార్ములాలతో మరింత శక్తివంతమైన మందులు తయారు చేసి ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు ప్రారంభించింది టీటీడీ ఆయుర్వేదం.
సరికొత్త ఫార్ములాతో...
కరోనా ( కోవిడ్ 19 ) నుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించే ప్రయత్నాల్లో భాగంగా టీటీడీ యాజమాన్యం ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, వైద్యశాల, ఫార్మశీ ల నేతృత్వం లో క్రిమిసంహారక ధూపం, ముక్కులో వేసుకునే చుక్కల మందు, నోరుపుక్కిలించే ద్రావకం, చేతులు శుభ్రం చేసుకునే ద్రావకం, రోగనిరోధక శక్తి పెంచే 5 రకాల మందులను తయారు చేయించి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ మందులను వాడిన వారి నుంచి ఫార్మశీ అధికారులు అభిప్రాయాలు సేకరించారు. వీటి వాడకం ద్వారా తమలో మంచి ఫలితాలు కనిపించాయని వారు వివరించారు. మందులను మరింత సులువుగా వాడుకునే విధంగా తయారు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని సలహాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం తయారు చేస్తున్న మందులకు మరిన్ని ఆయుర్వేద మూలికలు జోడించి కొత్త ఫార్ములాలతో మందులు తయారు చేయాలని యోచిస్తున్నారు.
క్రిమిసంహారక ధూపం చూర్ణాన్ని క్యాండిల్ గాను, స్వేదన ప్రక్రియ ద్వారా ఆల్కాహాల్ రహిత సానిటైజర్ ను తయారు చేసే ప్రయత్నం ప్రారంభించారు. ముక్కులో వేసుకునే చుక్కల మందుకు యాంటీ వైరల్ గుణాలున్న మరిన్ని మూలికల రసం, అనుతైలం లోని కొన్ని మూలిక రసాలను ఇందులో చేర్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు. గుండూష చూర్ణం నేరుగా వాడుకునేందుకు వీలుగా ద్రవరూపం లోనికి మార్చబోతున్నారు.వ్యాధి నిరోధక శక్తి ని పెంచే అమృత బిళ్లలకు మరిన్ని శక్తివంతమైన మూలిక లు జత చేసి కొత్త ఫార్ములా ను రూపొందించి ఆయుష్ శాఖనుంచి లైసెన్స్ పొంది ఈ 5 ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయడానికి పూనుకునే యోచన చేస్తున్నారు.
డిసెంబర్ లోగా లైసెన్స్
కోవిడ్ నివారణకు సరికొత్త ఫార్ములా తో తయారు చేయబోతున్న 5 రకాల మందులకు డిసెంబర్ లోగా ఆయుష్ శాఖ నుంచి లైసెన్స్ పొందాలని టీటీడీ ఆయుర్వేద విభాగం నిర్ణయించింది. ఈ మందులు వాడే విధానం, లాభాల వివరాలతో చిన్న కరపత్రం తయారు చేసి ఆనంద నిలయం బొమ్మతో తయారుచేసిన ప్రత్యేక మైన ప్యాకింగ్ తో వీటిని ప్రజలకు అందించనున్నారు.
పరిశోధన దిశగా...
ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి, ఫార్మశీ విభాగాల ఆధ్వర్యంలో ఆయుర్వేద మందుల తయారీ లో పరిశోధనలు చేయించాలని టీటీడీ యోచిస్తోంది. ఇటీవల తయారు చేసిన 5 రకాల మందులను ఆయుష్ అదనపు డైరెక్టర్ డాక్టర్ శాస్త్రి అభినందించారు. కొత్త ఫార్ములాలతో మందులు తయారు చేసి డిసెంబర్ లోగా లైసెన్స్ పొందే ప్రయత్నం చేస్తున్నారు.