తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉదయం 3.45 గంటలకు సర్వదర్శనం ప్రారంభించడంతో సామాన్యభక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి 1.15 గంటల ముందుగానే సర్వదర్శనం ప్రారంభం కావడంతో భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
శ్రీవారి దర్శనానంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. ఈ పర్వదినం సందర్భంగా టిటిడి ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
వైభవంగా స్వర్ణరథోత్సవం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు.
ఆకట్టుకున్న దశావతార వైభవం, అష్టలక్ష్మీ సెట్టింగులు
శ్రీవారి ఆలయం వద్దగల వైభవోత్సవ మండపం పక్కన దశావతార వైభవం, అష్టలక్ష్ముల సెట్టింగులు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని రూ.25 లక్షల వ్యయంతో దాత సహకారంతో ఏర్పాటుచేశారు.
జనవరి 7న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.