వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం


శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శ‌నివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మొదటిరోజు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.





ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.





అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్ద‌శేష‌ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జూలై 7న హనుమంత వాహనం, జూలై 8న గరుడ వాహన‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.





పెద్దశేష వాహనంపై శ్రీ క‌ల్యాణ వెంక‌న్న‌ కనువిందు





సాక్షాత్కార వైభ‌వోత్స‌వాల్లో మొదటిరోజు రాత్రి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఏడు తలల పెద్ద శేషవాహనంపై మాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.





Source