అప్పలాయగుంటలో పుష్పయాగం.. భ‌క్తుల త‌న్మ‌య‌త్వం..


టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ దంప‌తులు పాల్గొన్నారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.





ఈ ఏడాది జూన్‌ 13 నుండి 21వ తేదీ వరకు ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాతలు ఒక‌టిన్న‌ర ట‌న్ను పుష్పాలను విరాళంగా అందించారు.





స్నపన తిరుమంజనం





ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు.





ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీపద్మావతి, శ్రీఆండాళ్‌ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 14 రకాలకు చెందిన ఒక‌టిన్నర టన్నుల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.





Source