ఈ ఏడాది మూడు నెలల పాటు శుక్రమూఢం, శూన్యమాసం ఉండడం వలన ఎలాంటి శుభకార్యాల ముహూర్తాలు ఆ మూడు నెలలు లేవని పండితులు తెలియచేస్తున్నారు.
అసలు మూఢం అంటే ఏమిటి?
నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి అది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఈ భూమ్మీద ఉన్నాం కాబట్టి నవ గ్రహాలలో ఈ భూమిని చేర్చకుండా సూర్యుని వాటిలో చేర్చారు మన పంచాంగకర్తలు.
భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీనినే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
గురు, శుక్ర మూఢం మనుషులపై ప్రభావం చూపిస్తుంది
ఈ మూఢం అనేది అన్ని గ్రహాలకూ ఉంటుంది. కానీ గురు, శుక్ర గ్రహాలకు వచ్చే మూఢం మాత్రమే మనుషల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ గురు, శుక్ర గ్రహాలు సూర్యునికి 11, 10 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పట్టించుకుంటాం. దీన్నే మూఢంగా భవించి శుభకార్యాలు తలపెట్టం. సూర్యుని గ్రహ రాజుగా చెప్పాల్సి ఉంటుంది. దాని కాంతి ముందు ఇతర గ్రహాల కాంతులు వెలవెల పోతుంటాయి. ఇతర గ్రహాల శక్తిని అది హరించి వేస్తుంది. మానవాళికి గురువు గానీ, శుక్రుడు గానీ ఇచ్చే శక్తులు మూఢం సమయంలో పనిచేయవు. అందుకే మనం ఏ శుభకార్యాలు తలపెట్టం.
మూఢంలో మనం చేయకూడని పనులు
వివాహం, ఇళ్ల నిర్మాణం, గృహప్రవేశం, చెరువులు-బావుల తవ్వకం, దైవప్రతిష్ఠ, ఉపనయనం, విద్యారంభం, యజ్ఞయాగాలు తదితరాలు.
ఈ పనులు చేయవచ్చు
గ్రహశాంతికి అభిషేకాలు, వ్రతాలు, జపహోమ శాంతులు, గండ నక్షత్ర శాంతులు తదితరాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది(2019) లో మూడునెలలు ముహూర్తాలు లేవు
ఈ ఏడాది (2019) లో జూన్ 28 నుండి సెప్టెంబర్ 29 వరకు శుక్రమూఢం, డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు గురుమూఢం సంభవిస్తున్నాయి. అంటే జూన్ 27 తరువాత ముహూర్తాలు మళ్ళీ ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే ఆ సమయంలోనే వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు. శుక్రమూఢం, శూన్యమాసం వలన ఈ ఏడాది మూడు నెలల పాటు సుముహూర్తాలు ఉండవు. ఆషాఢ, భాద్రపద మాసాలు శూన్యం కాగా శ్రావణ మాసంలో శుక్రమూఢం వచ్చింది.
ఈ ఏడాది జులై 3న ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢం శూన్యం కాబట్టి శుభకార్యాలు చేయరు. ఆషాఢం ప్రారంభమైన ఆరు రోజుల తర్వాత శుక్రమూఢం ప్రారంభమవుతుంది. ఆగస్టు 2న శ్రావణమాసం వచ్చినప్పటికి శుక్రమూఢం ఉంటుంది. కనుక సుముహూర్తాలు ఉండవు. సెప్టెంబర్ 19న శుక్రమూఢం త్యాగమవుతుంది. ఆగస్టు 31 నుండి మరో శూన్యమాసమైన భాద్రపదం ప్రారంభమవుతుంది. శుక్రమూఢం సెప్టెంబర్ 19తో త్యాగం అవుతున్నప్పటికి భాద్రపద మాసం సెప్టెంబర్ 29 వరకు ఉండడంతో శూన్యమాసం కావడంతో అంతవరకు శుభముహూర్తాలు ఉండవు. అలాగే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు గురుమూఢం ఉందని పండితులు తెలుపుతున్నారు.
ఈ మూఢంలో ఈ కార్యక్రమాలు అయితే చేయవచ్చు
గర్భిణిని ప్రసవానికి తీసుకువెళ్లుట, జనన శాంతులు, నవగ్రహహోమ, దానాలు, జాతకరీత్యా గ్రహశాంతి ఆచరించడం, అన్నప్రాసనం, నామకరణం, వ్రతాలను అయితే ఆచరించవచ్చు.
మూఢంలో చేయకూడని పనులు
మూఢంలో యాగం చేయడం, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, వివాహ, ఉపనయనాలు, విద్యారంభం, గృహప్రవేశాలు, చెవులు కుట్టుట, పట్టాభిషేకాలు, వివాహ నిశ్చయ తాంబూలాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, దత్తత స్వీకారం, చెరువులు, బావులు తవ్వడం తదితర కార్యక్రమాలు చేయకూడదని పండితులు తెలియచేస్తున్నారు.