తిరుప్పావై అంటే శ్రీ వ్రతము. శ్రీ అంటే సంపద. అన్ని సంపదలను ఇచ్చే ఈ నోమునే ధనుర్మాస వ్రతం అంటారు. డిసెంబర్ మధ్యలో ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి జనవరి 14న మకరంలోకి వచ్చేవరకు ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్ని మార్గశీర్షం అంటారు. ఈ రెండూ ఒకటే. చాంద్రమానమును బట్టి మార్గశీర్షం అయితే, సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. మార్గము అనగా దారి లేదా ఉపాయం. శీర్షం అంటే శిరసువలె ప్రధానమైంది.
అందుకే భగవానుని పొందడానికి శ్రేష్ఠమైన ఉపాయమే ఈ వ్రతం అని ఉపనిషత్ సిద్ధాంతం. భగవానుడే ఉపాయం. ఇతరములేవీ కావు అనే విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది ఈ వ్రతం. ఉపనిషత్తు భాషలో ధనుస్సు అనగా ప్రణవం. అంటే ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దం. ఆ ప్రణవాన్ని ఉపాసించడం ద్వారా పరమాత్మను చేరు మార్గము ధనుర్మాస వ్రతం.
https://www.youtube.com/watch?v=K6y_HD2tlkg
గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ.
ఈ వ్రతానికి పాటించవలసిన నియమాలు
- ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా
- నోము నోచే ధనుర్మాసం నీమనిష్టలె పూజలౌ
- స్నానమంటే యమునలో
- చలిమునకలేస్తే చాలదే
- మనసు లోపలి మలినమంతా
- కడిగి ముగ్గెయ్యాలిలే
- పూసిన పూలూ పితికిన పాలూ పూతనాంతకుడి పూజకే
- కంటికి కాటుక పెట్టకే
- సిగలో పూలూ ముడవకే
- వెన్నా మీగడ - జున్నూనేయీ
- అన్నీ మన కన్నయ్యకే
- కూడని మాటలు ఆడకే
- పెద్దల మాటలు దాటకే
- సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము
- గోకులం కన్నెలకు కల్యాణకరము
- లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
- పల్లెపిల్లా మేలుకో
- రే- పల్లె పిల్లా మేలుకో
ద్వాపరం నుంచి ఇప్పటి దాకా..
ఈ వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలు కృష్ణుని పొందాలని ఇదే వ్రతాన్ని కాత్యాయనీ వ్రతంగా చేశారు. ఫలితంగా ప్రజలకు ఈతి బాధలు తొలగి, సర్వ సౌఖ్యాలను పొందారు. ఆ తరువాత కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి అక్కడ కొలువై ఉన్న వటపత్రశాయినే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా, ఆలయాన్ని నందగోప భవంగా, తన తోటి చెలికత్తెలందరూ గోపికలుగా, తానూ ఓ గోపికగా త్రికరణ శుద్ధిగా భావించి, ఈ వ్రతాన్ని ఆచరించింది. సర్వ విధాలుగా నీకే చెంది ఉన్నాను. నీదే అయిన ఈ ఆత్మకు అనర్థం జరుగకుండా కాపాడు. ఈ ఆత్మ స్వరూపానికి తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆమె శ్రీకృష్ణుని వేడుకొన్నది. ఫలితంగా శ్రీరంగనాథుడిని చేరుకున్నది. గోదాదేవి ప్రార్థనే తిరుప్పావై సారము. ఈ ధనుర్మాస మహావ్రతం ఇహ పర ఐశ్వర్యాలను, భగవదనుభవాన్ని, కైంకర్యాన్ని ప్రసాదిస్తుంది.