చిన్నశేష‌వాహ‌నం పై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చిన పద్మావతీ అమ్మవారు

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమపదనాథుని అలంకారంలో చిన్నశేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు.

శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్‌, టీటీడీ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.