పాంచరాత్ర ఆగమ విధానంలో విశేషంగా ఉత్సవం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, వివిధ రకాల ఎండు ఫలాలు, మూడు రంగుల రోజా పూలు, లిల్లీపూల మాలలు అమ్మవారికి అలంకరించారు.
ఆకట్టుకున్న ఫల,పుష్ప మండపం
స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపంలో వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, తదితర అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, మొక్కజొన్నలతో ఆకర్షణీయంగా రూపొందించారు. బ్రహ్మోత్సవాలలో 3 రోజుల కోసారి వివిధ రకాలపుష్పాలను మార్చి అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దుతారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, సుందరనరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపంలలో టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఇందుకుగాను 5 టన్నుల వివిధరకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు ఉపయోగించారు.
స్నపనంలో భాగంగా ప్రతి రోజు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ధ్వజా రోహణం నుండి పుష్పయాగం వరకు అమ్మవారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్తమమైన ద్రవ్యాలు, ఉపకరణాలతో స్నపనం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.