సరస్వతిదేవి అలంకారంలో హంసవాహనంపై అభయమిచ్చిన అమ్మవారు

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల రెండో రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో హంస వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు.

అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్‌, టీటీడీ ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.