వేడుకగా ప్రారంభమైన తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ సోమవారం రాత్రి వేడుకగా అంకురార్పణ జరిగింది. మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ఇవి జరుగుతాయి.

అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయంలో పుణ్యహవచనం, రక్షాబంధం, సేనాధిపతి ఉత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అమ్మవారికి, భోగశ్రీనివాసమూర్తికి పూజలు చేసి రక్షాబంధం చేశారు. ఆలయంలోని చక్రత్తాళ్వార్‌, ధ్వజస్తంభంపైకి ఎగురవేసే గజపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్వసేనాధిపతి విష్వక్సేనుడు భేరి నినాదాల మధ్య తిరుచ్చి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయంలోని యాగశాలలో ఉద్యానం నుంచి తీసుకొచ్చిన పుట్టమట్టిని నవధాన్యాలతో కలిపి కలశంలో నింపి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు ఉదయం ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల 8.50 గంటల మధ్య కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.

11న ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విడుదల


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల మార్చి నెల కోటాను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది. రూ.300 చెల్లించి..ఆన్‌లైన్‌, ఈ- దర్శన్‌, తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు పొందవచ్చు.