కాకికి అన్నం ఎందుకు పెడతారు? కాకికి అన్నం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి?

ప్రధానంగా కాకికి రెండు కారణాలచేత ప్రతీ రోజు అన్నం పెట్టాలని మన పురాణాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి మన పితృదేవతలు కాకి రూపంలో భూలోకంలో సంచరిస్తూ మనల్ని కనిపెట్టుకుని ఉంటారట. మనం ప్రతీ రోజూ భోజనం చేసే ముందు కాకికి పెట్టి అది తిన్న తరువాత మనం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే పితృదేవతలు ముందుగా భుజించి మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత మనం భుజిస్తే అది పుణ్యప్రదమని మన ధర్మం బోధిస్తోంది.

https://www.youtube.com/watch?v=o_czGxAm36o

కాకికి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు సంతృప్తి చెంది మనకు అశీర్వాదములు ఇస్తారు. మన ఇళ్లల్లో పితృ కర్మలు చేసిన సందర్భంలో కాకికి పెట్టిన పిండం ముట్టకపోతే మన పితరులు మనపై ఆగ్రహంతో లేదా అసంతృప్తితో ఉన్నారని అర్ధం అని పెద్దల మాట. అందువల్లే అలాంటి సందర్భాల్లో ముందుగా కాకి అన్నము ముట్టే వరకు వేచి ఉండి తర్వాత భోజనం చేస్తారు. మన పూర్వీకులు ప్రతీ రోజు కూడా కాకి అన్నం ముట్టాకే తాము భుజించేవారు.

గయలో మనం పిండాలను వేసే శిలకు ‘‘కాక శిల’’ అని పేరు. ఆ శిలపై పిండాలు వుంచి మన పితృదేవతలను ప్రార్ధిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది. మన ఇంటి ముందు కూడా కాకికి అన్నం పెడితే మిగిలిన కాకులను కూడా పిలిచి ఆహారం పంచుకుంటుంది. ఈ చర్చ మనిషికి ఒక సందేశం కూడా ఇస్తుంది. అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి.

శనైశ్చరుని అనుగ్రహం కోసం


కాకి శనైశ్చరుని వాహనం. మనము భోజనం చేసేముందు అన్నము ముందుగా దేవునికి నివేదనం చేసి తర్వాత కాకికి పెట్టమని మన శాస్త్రము చెపుతున్నది. కాకి శనైశ్చరుని వాహనము. అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే కాకి యమలోక ద్వారం వద్ద వుంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ వుంటుంది. అందువల్ల పితృదేవతలకు యమలోక బాధలు కూడా తొలగుతాయంటారు.

భూతదయ


మానవతా ధృక్పధంతో ఆలోచించినా కాకి సౌమ్యజీవి, భయస్తురాలు, ఎవ్వరికీ హని చేయదు. అలాగే మన చుట్టూ ఉన్న వ్యర్థాలు తిని బతుకుతుంది. అటువంటి ప్రాణికి అన్నం పెట్టడం కూడా ఒక దానంతో సమమైన చర్యనే కదా....