మార్గశిర మాసంలో ఏయే దేవతలను ఆరాధించాలి? మార్గశిర మాస విశిష్ఠతలు ఏమిటి?

మార్గశిర మాసానికి తెలుగు మాసాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని, మార్గశిర మాసమని పేర్లు వచ్చాయి.మార్గశిర మాసం హేమంత ఋతువు లో వచ్చే మొదటి మాసము. మరి ఇదే మాసంలో ధనుర్మాసం కూడా వస్తుందేమిటి? అని అనే అనుమానం చాలామందికే వస్తుంది. ఇలా ఒకే నెలలో రెండు తెలుగు మాసాలు అని చెప్పడానికి కారణం ఏమిటంటే  చాంద్రమానం ప్రకారం ఇది మార్గశిరమాసం కాగా సౌరమానం ప్రకారం ఇది ధనుర్మాసం.

ఈ మాసం శ్రీకృష్ణునికి చెందిన మాసం అంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేర్కొన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ మాసంలో శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. చలికాలం మధ్యలో వచ్చే ఈ మాసంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, హోమాలన్నింటినీ శ్రీకృష్ణుడే స్వయంగా స్వీకరిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ నెలలో చంద్రుడు కూడా ఉచ్ఛస్థానంలో ఉంటాడు కాబట్టి చంద్రుని కూడా ఆరాధిస్తే మానశిక ప్రశాంతత కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది.

మార్గశిర శుద్ద పాడ్యమి నుండి శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. కార్తీకమాసం లాగానే ఈ మాసంలో కూడా సూర్యోదయం ముందే లేచి నదీ స్నానాలు చేస్తారు.  శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసమంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయండం వల్ల అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి.

ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?


సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. అందువల్లనే ఈ ధనుర్మాసంలో ప్రతి రోజూ ఆ విష్ణమూర్తికి మిరియాలతో చేసిన పొంగలి నివేదిస్తారు.

మార్గశిర శుద్ద పంచమి నాగపంచమిగా పిలువబడుతుంది. ఈ రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పబడింది.

మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్య షష్ఠికి ఆ స్వామికి పువ్వులు, పడగలు సమర్పించి ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి ఆయనకు పాయసం నివేదన చేస్తే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయి.

మార్గశిర అష్టమి ని కాలభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి ఈ రోజు భైరవుణ్ణి ఆరాధించడం వల్ల మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

ముక్కోటి ఏకాదశి విశిష్ఠత


మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు.దీనినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. అత్యంత పవిత్రమైన ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఈ రోజున విష్ణుమూర్తిని ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని, ఉపవాసదీక్ష చేసిన వారికి కోటి ఏకాదశులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజే లభిస్తుందని పురాణ వాక్యం.

ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమద్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు. హనుమంతుని శక్తిమేరకు పూజించడం వల్ల సకల శుభాలు సంప్రాప్తిస్తాయి.

మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి దత్తాత్రేయుని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

కార్తిక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. ఈ కాలంలో జనం వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మార్గశిర పౌర్ణమితో ఈ అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి కాబట్టి యముని పట్ల కృతజ్ఞత పూర్వకం గా మార్గశిర పౌర్ణమినాడు యమధర్మ రాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.