కార్తీక అమావాస్య 2018: కార్తీక అమావాస్య రోజున ఏంచేయాలి? కార్తీక అమావాస్య విశిష్టతలు ఏమిటి?

కార్తీక బహుళ అమావాస్య అనగా కార్తీక మాసములో కృష్ణ పక్షము నందు అమావాస్య తిథి కలిగిన 30వ రోజు. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ, వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. డిసెంబరు 7వ తేదీన కార్తీక అమావాస్య.

కార్తీక అమావాస్య-కమలాజయంతి


కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక ఈరోజున అందరూ తమ ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం నివేదించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి  మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పద్మనాభునికి దీపోత్సవం


కార్తీక అమావాస్య రోజున విశాఖ జిల్లా పద్మనాభంలో దీపోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం అనంతరం ఇక్కడ పద్మనాభస్వామిని దర్శించుకున్నారని, ఆ తర్వాత కుంతీదేవి ఈ ప్రాంతంలో కార్తీక అమావాస్య రోజు దీపాలను వెలిగించారని చెబుతుంటారు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య నాడు అనంత పద్మనాభుని దీపాలతో అర్చన చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఏటా కార్తీక అమావాస్య రోజు ఈ ఉత్సవం నిర్వహిస్తుంటారు.

కార్తీక అమావాస్య రోజున పితృకార్యాలు నిర్వహించాలి


కార్తీక అమావాస్య అయిన పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును, బిల్వదళాలతో శివునీ, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు, తర్పణాలు ఇవ్వడం మంచిది.