హనుమద్వ్రతకల్పము-హనుమద్వ్రతములో కలశస్థాపన ఎలా చేయాలి?

ఆర్తజన రక్షకుడు, భక్తసులభుడు అయిన ఆ హనుమంతుని అనుగ్రహం పొందటానికి భక్తులంతా పరితపిస్తుంటారు. ఇలా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే అందుకు దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకోవాలి. ఈ వ్రతంలో భాగంగా పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది.  హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఈ వ్రతంలో పంపా కలశ స్థాపనే ముఖ్య విధి.

మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||


మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాలి. ఎందువల్లనంటే మృగశిరానక్షత్రం అంటే హనుమంతునికి ఇష్టమైనది. అందువల్లనే ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి.



పంపాకలశ ప్రతిష్ఠ


ముందుగా పూజాసామాగ్రిలో భాగంగా ఆచమనం చేయడానికి ఒకటి, కలశస్థాపన కోసం మరొకటి రెండు పంచపాత్రలతో నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. సంకల్పంలో భాగంగా ముందుగా ఆచమనం చేయాలి.

ఆచమనం


ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్త మాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

గణపతి ప్రార్థన


(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: ఏషామిందీవరశ్శ్యామో హృదయస్థోజనార్థన.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యేత్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే.

ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు
దేవునిపై చల్లవలెను

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం శచీపురందరాభ్యాం నమః,
ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః,
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః,
నమస్సర్వేభ్యో మహాజనేభ్యః,
అయం ముహూర్త స్సుముహూర్తోస్తు
భూతోచ్చాటన

(క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

ఉత్తిష్ఠంతో భూత పిశాచాః (అంటూ రెండు అక్షతలను మన వెనుకవైపునకు వేసుకోవాలి)  ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అంటూ ముక్కుపై మూడు వేళ్ళను ఉంచి ప్రార్థిస్తూ  భూః ఓం భువః ఓం మహః ఓం జనః ఓంతపః   ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి.

ముందుగా పంపాకలశ ప్రరిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి. పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి, రాగి, లేదా కంచు పాత్ర ఉంచాలి. 'ఇమం మే వరుణ' మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో) నింపాలి.

ఇమం మే వరుణ శ్రుదీహవమద్యాచ మృడయ
త్వామవస్సురాచకే| తత్త్వాయామి బ్రాహ్మణా
వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్భి:|
ఆహేడమానో వరుణేహ బోధ్యోరుశగ్ సమానః||


"ఇమం మే గంగా'' అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమగొం నచతావరుష్ణియా|
అసిక్నియా మరుద్వ్రుదౌవితన్థ యార్జీకీయే శృణుహ్యసుషోమయా||

తరువాత ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను, అష్టగంధ, కర్పూరాలు ఉంచి

హ్రం హ్రీం హ్రూం హ్రై౦ హ్రౌం హ్రః తటిన్యా
ద్వాదశ కళా ఇహగాచ్చ తాగచ్చత||

'ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః
అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి 'బృహత్సామ' మంత్రంతో రక్షాబంధనం చేయాలి.
బృహత్సామక్షత్రభృద్వ్రుద్ధ వృష్టియం త్రిష్ణు భౌజశుఋభిత ముగ్రవీరం!

ఇంద్రస్తోమేనా పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా||

పుష్పాక్షతలు తీసుకుని - ఐ౦ హ్రీం శ్రీం ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివజటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహా||

సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాం
త్ర్యక్షా మూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్
దోర్భ్యాం చామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం
గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||


అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి.
తరువాత పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.

ఓం అనునీతే పునరస్మాసుచక్షుః ప్రాణమిహనోథౌహి భోగం
జ్యోక్సశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి| అమృతం
వై ప్రాణా అమృతమాపః ప్రాణా నేవ యథాస్థాన ముపహ్వయతే. పంపాకలశ
స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహగాచ్చ|
సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||
స్థిరభవ|| వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద||


అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి. తరువాత ఆంజనేయ స్వామిని అష్టోత్తరశతనామాలతో అర్చించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, కార్పూరహారతి సమర్పించాలి. అనంతరం చేతిలో అక్షతలు తీసుకుని భక్తిశ్రద్ధలతో కథను వినాలి.



హనుమద్వ్రతం కథ


శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.


అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు. తన జెండాపై కట్టబడ్డ వాడు, ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.

దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు. పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ.

అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు.