హనుమద్వ్రతం 2018: హనుమద్వ్రతం ఎలా ఆచరించాలి? ఎందుకు ఆచరించాలి?

ఎటువంటి భయాలనైనా పారద్రోలి మనో ధైర్యాన్ని ప్రసాదించే దైవం హనుమంతుడు. భూత, ప్రేత పిశాచాల భయాల నుండి మనకు విముక్తి కలుగజేస్తాడు ఆంజనేయుడు. ఊహ తెలిసిన పిల్లవాడి మొదలు అన్ని వయసులవారు ప్రేమతో, విశ్వాసంతో ఆరాధించే దేవుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని ఘనంగా ఆరాధించుకునే ఒక అద్భుత సందర్భం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు మనం చేసుకునే హనుమద్వ్రతం. మృగశిరానక్షత్రంతో త్రయోదశి కలిసి ఉన్న రోజు  హనుమంతునికి ఎంతో ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి హనుమద్వ్రతం ఒక దివ్యమైన మార్గం. 2018 డిసెంబరు 20వ తేదీన హనుమద్వ్రతం నిర్వహించాలి.

హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?


హనుమద్వ్రతం నిర్వహించే సందర్భం ఏమిటంటే హనుమంతుడు మార్గశిర శుద్ధ త్రయోదశినాడు లంకలో ఉన్న సీతామాతను తొలిసారిగా దర్శించాడు. శ్రీరాముని సందేశాన్ని ఆమెకు అందచేసి,మాతకు ఎనలేని సంతోషాన్ని అందించాడు. ఇందుకుగాను హనుమను మార్గశిర శుద్ధ త్రయోదశినాడు వ్రతపూర్వకంగా ఆరాధించినవారికి సమస్త మనోభీష్టాలు నెరవేరతాయని సీతాదేవి వరమిచ్చింది. అందుకే ఈశుభ తిథి హనుమద్వ్రతానికి వేదికైంది.

https://www.youtube.com/watch?v=JRx-sn6cTvc

హనుమద్వ్రతం నిర్వహించే విధానం


హనుమద్వ్రతంలో భాగంగా హనుమంతుని పూజించి, హనుమంతుని ఇంకా ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని, పంపానదిని తీరంలో వ్రతరూపంగా ఆరాధించాలి. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి అనే నియమం ఉంది కానీ. ఇది అందరికీ సాధ్యంకాదు కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.

పంపాజలం కూడా అందుబాటులో లేకపోయినట్టయితే ఒక కలశం ఏర్పాటు చేసి అందులో స్వచ్ఛమైన నీరు నింపి ఆ కలశంలోకి  పంపానదిని ఆవాహనచేసి పూజించాలి. తర్వాత హనుమత్ కథలను శ్రవణం చేసి ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకోవాలి. వ్రతంలో భాగంగా 13 ముళ్ల తోరాన్ని ధరించాలి. ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందన్నది పురాణ వచనం.

హనుమద్వ్రతాన్ని అరటితోటలో లేదా అరటిచెట్టు వద్ద నిర్వహించాలి. అక్కడ మంటపం ఏర్పాటుచేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి, దానిపై ధాన్యం పోసి కలశ స్థాపన చేయాలి. కలశాన్ని అలంకరించి, దాని సమీపంలో హనుమ విగ్రహం ఉంచాలి. ఆ తరువాత 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామి మూర్తి వద్ద ఉంచి పూజించి తరువాత ధరించాలి. హనుమంతుడి వ్రత ఆచరణ వల్ల కార్యజయం, బుద్ధి వికాసం, మనోధైర్యం, ఆరోగ్య సిద్ధి వంటి శుభఫలితాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తారు. అరటి తోటలో వ్రతం చేసుకోలేకపోతే ఒక అరటి మొక్కను కుండీలో ఏర్పాటుచేసి దాని ప్రక్కనే వ్రతం చేసుకోవచ్చు. పూజలో పుష్పాలతో పాటు తమలపాకులు వినియోగించాలి. నైవేద్యంగా హనుమంతునికి ఇష్టమైన అప్పాలు సమర్పించాలి.

హనుమద్వ్రతాన్ని పంపానదీ తీరంలోనే ఎందుకు చేసుకోవాలి?


చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. తాను ఉన్నది కూడా హనుమంతునికి ఇష్టమైన పంపానదీ తీరంలో కాబట్టి, సంతోషంతో పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే హుమద్వ్రత తిధి కలిసిరావడం, దైవజ్ఞలు కూడా హనుమద్వ్రతం చేయాలని చెప్పడంతో పండితుల పర్యవేక్షణలో రాజు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని పూర్తిచేశారు. ఫలితంగా హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. తర్వాత ఆయనకన్నీ విజయాలే ప్రాప్తించాయి. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటు వంటి వారిలో ద్రౌపదీ దేవి కూడా ఉంది. ద్రౌపదీ దేవి కూడా హనుమయొక్క ఆరాధన చేసి తన భర్తలయొక్క విజయాన్ని పొందగలిగింది. ప్రతీయుగంలోనూ హనుమంతుని విజయగాధలు మనకు కనిపిస్తాయి. ఆయా యుగాల్లోని హనుమంతుని విజయగాధలను వ్రతకథలుగా చదువుకుని వ్రతాన్ని ముగించాలన్నమాట. దేశంలో పదమూడు ఆంజనేయ క్షేత్రాలున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరంలో ఒక పీఠం ఉంది.