కార్తీక మాసములో దీపదానము ఎందుకు చేయాలి? ఫలితములు ఏమిటి?

కార్తీకమాసములో దీపదానము ఎంతో శ్రేష్టమైనది. కార్తీకమాసము అగ్నిసంబంధమైన మాసము. అనగా కృత్తికా నక్షత్రము పౌర్ణమినాడు కలిగి ఉన్న మాసమే కార్తీకమాసము. ఈ అగ్నిసంబంధమైన ఈ మాసములో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాలు వెలిగించడంతోపాటు ఆ దీపాలను ఒక బ్రాహ్మణునికి దానం చేయడం కూడా ఎన్నో ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టుకుని, జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేసుకోవడానికి ఈ మాసంలో దీపదానం తప్పక చేయాలి.

ఎన్ని దీపాలు దానం చేయాలి?


ఒక దీపమును దానము చేసినట్లయితే తెలిసో తెలియకో చేసిన పాపాలు హరిస్తాయి. పది దీపములు దానము చేసినట్లయితే మహాపాతకములు నశిస్తాయి. వంద దీపములు దానము చేయడం వలన శివసాన్నిధ్యము పొందుతారు. ఇంతకు మించి దీపములు దానము చేయడం వల్ల స్వర్గాధిపత్యమును పొందుతారు. ఈ దీపదాన ప్రభావము ఎంతటి దంటే బ్రహ్మాదులు ఈ దీపదాన ప్రభావము వల్లనే వైకుంఠమునందు శాశ్వతమైన నివాసమును పొందారు. అంతేకాక దీపదానమును తులసీ సన్నిధానములో చేసినట్లయితే అతడు వైకుంఠములో సమస్తమైన భోగములను అనుభవించి విష్ణుసాన్నిధ్యము పొందుతాడు. దీపాన్ని దర్శించినంత మాత్రానే ఆయుర్దాయము, బుద్దిబలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణ కలుగుతాయని పురాణాలలో పేర్కొనబడింది.

దీపదానానికి ఏ నూనె మంచిది


ఈ దీపము దానము చేయడానికి ఆవునెయ్యి ఉత్తమమైనది. మంచినూనె మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పనూనె కూడా వాడవచ్చు. అడవిలో పుట్టిన ఇతర రకాల నూనెలు, పామాయిల్ వంటి నూనెలతో దీపం వెలిగించడం అస్సలు మంచిదికాదు.

ఆవాలనూనె తోగాని, అవిశె నూనెతో గాని దీపము పెట్టినట్లయితే శతృవులు నశిస్తారు. ఆముదంతో దీపం పెట్టినట్లయితే సంపద, ఆయువు తగ్గిపోతాయన్నమాట. గేదెనెయ్యితో దీపం అస్సలు వెలిగించకూడదు. దీనివల్ల పుణ్యం రావడం కాదు కదా పూర్వజన్మలో చేసిన పుణ్యాలు కూడా పోతాయి. అయితే ఈ గేదెనెయ్యిలో కొద్దిగా ఆవునెయ్యి కలిపి దీపం పెట్టినట్లయితే ఆ దోషం ఉండదు.

https://www.youtube.com/watch?v=7QbRvGbejEc

దీపదాన మహాత్మ్యము


ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసినట్లయితే సమస్త పాపములు పోతాయి. బుద్ధిమంతుడు అవుతాడు. మంచి తెలివితేటలు అబ్బుతాయి. నాలుగు వత్తులతో దీపములను పెట్టి దానము చేసినట్లయితే రాజు అవుతాడు. అంటే అంతటి ఉన్నత స్థానం పొందుతాడన్నమాట. పది వత్తులతో వెలిగించిన దీపములను దానము చేసినట్లయితే చక్రవర్తి అవుతాడు. అంటే అతి పెద్ద హోదాలో ఉంటాడని అర్థము. యాభై వత్తులు వేసిన దీపములను దానం చేసినట్లయితే దేవతలలో ఒకడవుతాడు. వంద వత్తులతో కూడిన దీపదానము చేసినట్లయితే విష్ణురూపుడవుతాడు. ఈ ఫలము విష్ణు క్షేత్రములో గాని, తులసీ సన్నిధిలో గాని చేసినట్లయితే రెండు రెట్లు, నదీ తీరములలో చేసినట్లయితే మూడు రెట్లు ఫలితములు కలుగుతాయి. కార్తీకపౌర్ణమి రోజున తాము స్వయంగా తయారుచేసి, ఆవునెయ్యితో తడిపిన 365 వత్తులను ఒక బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం మరింతగా ఉంటుంది. అయితే ఈ దీపదానంతో పాటు ఎవరి శక్తికి తగ్గట్టు వారు దక్షిణతో పాటుగా బ్రాహ్మణునికి అందచేయాలి.