తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 4 నుంచి 12వ తేదీ వరకు కన్నులపండువగా నిర్వహించేందుకు విస్తృతంగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.
బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 11న రథోత్సవం, డిసెంబరు 12న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పట్లు చేపడుతున్నారు.
కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు సంతృప్తికరంగా అమ్మవారి మూలమూర్తిని, వాహనసేవలतग తిలకించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల రోజుల్లో 10, పంచమీతీర్థం రోజున 8 ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేస్తారు. నవంబరు 28 నుండి ప్రచార రథాల ద్వారా తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో టిటిడి ప్రచారం చేస్తుంది. వాహనసేవల ముందు ప్రదర్శనలిచ్చేందుకు హిందూ ధర్మప్రచార పరిషత్ నుండి 6, దాససాహిత్య ప్రాజెక్టు నుండి 4 కలిపి మొత్తం 10 కళాబృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
వాహనసేవలో ధర్మగిరితోపాటు కీసరగుట్ట, భీమవరం వేద పాఠశాలల విద్యార్థులతో వైదిక హారం నిర్వహిస్తారు.