https://www.youtube.com/watch?v=BL8MbdWy3Eo
ఉసిరి దీర్ఘాయువును ప్రసాదించే అమృతం
క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు!
ఆయుర్వేదంలో ఆరు రుచులన పేర్కొంటారు అవి… మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కషాయం (వగరు), లవణం (ఉప్పదనం), కటువు (కారం), తిక్తం (చేదు). ఏ ఆహారపదార్థలోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్బుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా అయిదు రుచులూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుచుకోవడం కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు.
ఉసిరి లోని ప్రతీ భాగమూ ఆరోగ్యకరమైనదే...
ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.
ఉసిరి విష్ణు స్వరూపం
అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసిరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.