వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన ఇతర వృక్షాల నడుమన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాల వచనం.
సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను... తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది.
https://www.youtube.com/watch?v=r-iOUZ89Bo4
వనభోజనాల సమయంలో పాటించాల్సిన నియమాలు
వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు. ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.
ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు.
ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు.
వనభోజనం అంటే అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్లి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. దీని వెనక ఒక పరమార్థం ఉంది. ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది. అదే విధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది. మనకు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కలగజేస్తూ.. ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక సారైనా ప్రకృతిని కోరుకోవాలి. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది?
వనము, అన్నము పరబ్రహ్మ స్వరూాపాలే
కార్తికమాసంలో వనభోజనాలు పెడతారు. దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు. వనం అంటే పరబ్రహ్మం. అన్నం కూడా పరబ్రహ్మమే. అందుకే ఈ రెంటినీ ఒకే చోట చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వనభోజనాలు అని చెబుతారు. దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే- అరణ్యంలో ఎవరికీ సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి ఉండగలిగే ఆశ్రమం... అందుకే మన ఋషులు, మునులు వనాలను వేదికగా చేసుకుని నివాసం సాగిస్తూ తపో నిష్టతో భగవంతుని ఆరాధిస్తారు. అందుకే వారు సిద్ధపురుషులుగా పిలువబడుతున్నారు.
మనం కూడా జీవితంలో ఈ లౌకిక ప్రపంచం నుండి దూరంగా వెళ్లి గడిపితే మన అంతరంగం అంతా ప్రక్షాళన అవుతుంది. దీనికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతి వేరు కదా... అంతే కాకుండా వన భోజనాలు మనుషులను మాససిక వత్తిడుల నుండి దూరంగా ఉంచుతాయి. బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుతాయి.
పూర్వీకుల నిర్వచనం ప్రకారం ఆశ్రమం మారటం అంటే - ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు అర్ధం. ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి మారడం... వానప్రస్థానికి వెళ్లటం అంటే గృహస్థాశ్రమం వీడి మరోక లోకానికి వెళ్లడం... ఇలాంటి మార్పులకు సాధన కావాలి. ఈ సాధనలో ఒక భాగంగా ఈ వనభోజన కార్యక్రమాలను మన పురాణ గ్రంధాలు కూడా నిర్వచిస్తున్నాయి.
శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, షిరిడీ సాయిబాబా ఇలా మనం ఆరాధించుకునే దేవతలందరూ కూడా వనభోజాలలో పాల్గొన్నవారే.