దీపంలో కనిపించే నీలకాంతి విష్ణుమూర్తికి, తెల్లనికాంతి పరమశివునికి, ఎరుపు బ్రహ్మదేవునికి అర్దంగా చెబుతారు. అలాగే దీపకాంతి విద్యా, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి,లక్ష్మిదేవిలకు ప్రతీక. భగవంతునికి సమర్పించే షోడశోపచారాలతో దీప సమర్పణ ఒకటి. జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్దిశక్తులను ప్రసాదిస్తుందని చెప్తారు. అందుకే దీపారాధనకు పర్వదినాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఫుణ్యదినాల్లో చేసే దీపారాధనకు మహత్తు అధికంగా ఉంటుందని మన శాస్త్రగ్రంధాల్లో చెప్పబడింది.
కార్తీకమాసం-దీపారాధన
ఆధ్యాత్మికంగా అన్నిమాసాలకన్నా కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే దీపానికి కూడా ఈ మాసంలో అంతే ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రంతో కలిసి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని కార్తీకమాసంగా పిలుస్తాం. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం కాబట్టి ఈ మాసం అంతా దీపాలను వెలిగించాలని, దీపం అగ్నిస్వరూపం కూడా కాబట్టి ఈ మాసంలో దీపారాధనకు అంతటి ప్రాధాన్యత లభించింది.
అంతే కాకుండా దీపం నుండి వచ్చే వెలుగు కాంతి నిస్తుంది. ఇది మనసులను ఉత్తేజపరుస్తుంది. కార్తీకమాసం చలికాలానికి స్వాగతం పలుకుతూ ప్రవేశిస్తుంది. ఈ కాలంలో అనేక రకాల వ్యాధులు ప్రబలడం ప్రారంభిస్తాయి. దీపం వెలిగించినప్పుడు ఆవునెయ్యి, లేదా నువ్వుల నూనే ద్వారా వచ్చే పొగ ద్వారా మనకు హాని కలిగించే క్రిములు నశిస్తాయి. ప్రధానంగా దీపాల నుండి వచ్చే పొగ శ్వాస సంబంధ వ్యాధులను రాకుండా చేస్తుంది.
ఏడాది పొడవునా ఇంట్లో లేదా ఆలయాల్లో ఎక్కడా కూడా దీపాన్ని వెలిగించని వారు ఒక్క కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపం వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీకమాసంలో ఎప్పుడైనా సరే కొబ్బరిచిప్పలో(నారికేళం) దీపం వెలిగిస్తే నరకం ఉండదని పెద్దలు చెబుతారు.
ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలోగానీ, చెరువులు, కొలనులు, బావుల వద్ద గానీ స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆర్ఘ్యం విడవాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.
కార్తీకపౌర్ణమి విశిష్టత
కార్తీకపౌర్ణమి పవిత్రమైనది. ఆ రోజు సూర్యోయానికి ముందే లేచి దీపారాధన చేయడం ఇతర అన్ని దినాల్లో చేసిన ఫలితం కన్నా అనేక రెట్లు పుణ్యప్రదమైన అంశం. ఆ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం నదీస్నానం చేసి దీపారాధన చేయడం మరింతగా ఫలితాన్నిస్తుందని మన శాస్త్రాల్లో పేర్కొనబడింది. కార్తీకమాసంలో మన పూజా మందిరంతో పాటు సాయంకాలం వేళ ఆలయాల్లో లేదా రావి చెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. ఉదయం, సాయంత్రం కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించి లక్ష్మీదేవిని, శ్రీమన్నారామణుని స్మరించుకోవాలి.
దీపారాధన ఎలాచేయాలి?
అన్నింటికన్నా ముఖ్యంగా కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. పౌర్ణమినాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఆలయాల్లో కానీ మన ఇంటివద్ద తులసి కోట వద్దకానీ ఉసిరికాయపై ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే అంతటి ఫలితం మరెప్పుడూ లభించదు.
అలాగే బియ్యప్పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యివేసి దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు.
కార్తీకం-దీపదానం
కార్తీకమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని అంటారు. దీప దానం చేయాలనుకునే వారు పత్తితో తామే స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండితో ప్రమిదలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించి, తగిన దక్షణతాంబూలంతో పాటు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||
ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ' అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈ దీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అని అర్ధము.
కార్తీక అమావాస్య నాడు దేవాలయాలలో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు. అక్కడ మీరు కూడా మీవంతు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇలాంటి చోట ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకప్రాప్తి కలుగుతుందంటారు.
కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం ద్వారానే కాదు... కేవలం వాటిని దర్శించి నమస్కరించడం వలన కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది. కేవలం మనుషులకే కాదు ఈ దీపాలను దర్శించే సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొనబడింది.. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.