కార్తీకపౌర్ణమి-జ్వాలాతోరణం: కార్తీక జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు?

శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం. ఈ మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. ఆశ్వీయుజ అమావాస్య మనందరికీ దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీకపౌర్ణమి నాడు "జ్వాలతోరణం" చూస్తే చాలు జన్మ జన్మల దోషాలు హరించుకు పోతాయి.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. కార్తీకపౌర్ణమినాడు సాయంత్రం శివాలయాల్లో, లేదా ఇతర ఆలయ ప్రాంగణాల్లో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీని జ్వాలాతోరణం అని, యమద్వారం అని పిలుస్తారు.

గడ్డచుట్టి తయారు చేసిన కర్రలపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకి లో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు.

https://www.youtube.com/watch?v=Xi9dUsAx3IY

జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు


త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింన రోజు కార్తీకపౌర్ణమి అని ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడు కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించిందని ఒక కథ చెబుతుండగా...

అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా పొగలు కక్కుతూ హాలాహలం అంటే కాలాకూట విషం పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమని మొరబెట్టుకుంటారు. ఈ యావత్తు జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకరక్షణ కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు. ముల్లోకాలను కడుపుో పెట్టుకుని కాపాడే పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మ్రింగితే లోకాలన్నీ కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే... దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడే పరమేశ్వరుడు గరళ కంఠుడు / నీల కంఠుడు గా మారాడు. ఇది జరిగాక కూడా పార్వతీదేవి పరమేశ్వరుని శ్రేయస్సు కాంక్షించి పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది.

ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం.

యమద్వార ప్రవేశం ఉండదు


మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక మరో కారణం కూడా వుంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే.. ఈశ్వరుడిని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి.

అలాగే జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ... పరమేశ్వరా నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి.. ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అది ఉన్న చోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం.

ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వార ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భౌ అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చనే భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది.

ఆత్మ వెంటపడి తరిమిన కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధ వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు.