నరకచతుర్దశి 2018: నరకచతుర్దశి నాడు పాటించవలసిన నియమాలు ఏమిటి?

నరక చతుర్దశి నాడు ఎవరైతే నరకంలో ఉండే వాళ్ల కోసం దీపాలు పెడతారో వాళ్లు నరకం నుండి స్వర్గానికి వెళతారని శాస్త్రవాక్యం. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్యదినమే ఈ నరకచతుర్దశి. ఈ రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించి తీరాలని మన పెద్దలు సూచించారు.

అభ్యంగన స్నానం


నరకచతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగనం అంటే ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, నలుగుపెట్టుకుని ఒంటికి పేరుకున్న మకిలిని వదిలించడమే అభ్యంగనం! ఈ రోజున తప్పనిసరిగా అభ్యంగనాన్ని చేయాలని చెప్పడం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. శరీరభాగాలు మొద్దుబారిపోవడం దగ్గరనుంచీ, గుండెపోటు వరకూ రక్తప్రసరణకి సంబంధించిన ఎన్నో రోగాలు చలికాలంలో విజృంభిస్తాయి. చలికి రక్తానాళాలు ముడుచుకుపోవడమే దీనికి కారణం! ఈ రోజు చేసే అభ్యంగనం మన రక్తప్రసరణలో కొంత చురుకుని పుట్టిస్తుంది. అందుకే ఈ రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని మన పెద్దలు చెప్పారు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. ఈ రెంటితో మన శరీరానికి చేసే మర్దనం, ఒంట్లోని రక్తనాశాలలో చురుకుని పుట్టిస్తుంది. ఇదీ స్థూలంగా ఈ రోజు అభ్యంగనం చేయడం వల్ల కలిగే లాభం!

దీపం


నరకచతుర్దశినాటినుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఈ రోజు ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ, అది వాతావరణం మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వులనూనె దీపారాధనకు శ్రేష్ఠమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురు, వేడిని ఈ దీపారాధన కలుగచేస్తుంది.

దక్షిణదీపం


నరకచతుర్దశినాటి మునిమాపువేళ దక్షిణ దిక్కుకేసి ఒక దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు పెద్దలు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబతారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని నమ్మకం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చినవారవుతారు అని శాస్త్రం చెబుతోంది. అందుకనే ఈ రోజుకి `ప్రేతచతుర్దశి` అన్న పేరు కూడా ఉంది. సాధారణంగా పెద్దలను తల్చుకుని వారికి అభిమానపూర్వకంగా ఏదన్నా సమర్పించడానికి ఏదో ఒక క్రతువు ఉంటుంది. అలా ధనంతో కానీ, క్రతువులతో కానీ సంబంధం లేకుండా బీదాసాదా అందరూ తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తల్చుకుని కొల్చుకునే అవకాశమే ఈ దీపం! నిజానికి మొదట నరకచతుర్దశే ముఖ్యమైన పండుగగా ఉండేదనీ, నరక అన్న పదం నరకాసురుని కాకుండా నరకాన్ని సూచించేదనీ కొందరి వాదన కూడా!

పిండివంటలు


ఇక నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వులుశరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగనం, నువ్వులతో పిండివంటలు, నువ్వులనూనెతో దీపం… ఇదీ నరకచతుర్దశినాటి నియమం!

దీపదానం ప్రాముఖ్యత


చతుర్దశ్యాం తు యే దీపాన్‌ నరకాయ దదాతి చ|

తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

భావం : చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

ఈ పర్వ సంబంధమైన కార్యకలాపంలో ముఖ్యమైనది ఏమిటంటే తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయడం చాలా మంచిది. నరకచతుర్ధశినాడు సాయంకాలం దీపదానం చేయాలి. దేవాలయాల్లో మఠాల్లో, ఇండ్లలో దీపాలు వెలిగించాలి. ప్రజలంతా ఈరోజు, దీపావళిరోజు, కార్తికశుద్ధ పాడ్యమిరోజు దీపప్రదానము విధిగా చేయాలి. శాస్రాల్లో సాయంకాలం చేసే ఈ దీపదానాల వల్ల రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లు చెప్పబడింది. ఈ దీపాలు నరకలోకవాసులకు వలసిన వెలుతురును ఇస్తాయి. ఈ దీప దానాలవల్ల ఇక్కడి వారికి యమమార్గాధికారుల బాధ లేకుండా పోతుంది, నరక బాధ తప్పిపోతుంది.