ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబరు 17న స్వర్ణరథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వర్ణరథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 4.10 నుండి 4.45 గంటల వరకు కన్యా లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7 గంటలకు స్వర్ణరథోత్సవం మొదలవుతుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
Source