దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.
మూడు రంగులు-ముగ్గురమ్మలకు ప్రతీక
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనం. జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగాను, దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లవుతుందని పెద్దల సూచన.
అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే
దక్షిణాయనంలో చేసిన పాపాలు దూరంచేయాలని కోరుతూ , ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని వెలిగించి దానం చేయాలి. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.
దిబ్బు దిబ్బు దీపావళి
‘‘దిబ్బు దిబ్బు దీపావళి... మళ్ళీ వచ్చే నాగులచవితి’’ అంటూ దీపావళి రోజున సాయంత్రం ప్రదోష సమయంలో చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ వత్తుల్ని కట్టి వెలిగించి దిష్టితీయిస్తారు. తరువాత దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించాలి. ఆ దీపాన్నే ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తినాలి.
అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజించాలి. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చుకోవాలి. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ.
బాణాసంచా ఎందుకు కాల్చాలి?
బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్య్ర దుఃఖాలు దూరంగా తరిమి వేయబడి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అంతేకాక ఈ ఉత్సాహంలో మన కష్టాలన్నీ మరచిపోయి ఆనందం సొంతం చేసుకోవచ్చు. దీనితోపాటు వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురునీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. మరో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.