అష్ట వినాయకులు
స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మొరేస్వరం సిద్ధిదం,
బల్లాళం మురుడం వినాయకమడమ్ చింతామణీ థేవరం
లేన్యాద్రిం గిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం ఓఝరం !
గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళమ్ |
ఈ శ్లోకమునందు అష్టవినాయక క్షేత్రములు, అచ్చటి వినాయకుల పేరు చెప్పబడినవి. ఇదే విధముగా, అష్ట వినాయక మంగళ శ్లోకమునందు అష్టవినాయక క్షేత్రములు, ఆయా వినాయకుల పేర్లు పేర్కొనబడినవి.
- మోర్గాం శ్రీ మోరేశ్వర్ (లేక) శ్రీ మయూరేశ్వర్
- సిద్దటేక్ శ్రీ సిద్ది వినాయక
- పాలీ శ్రీబల్లాళేశ్వర్
- మహాడ్ శ్రీ వరద వినాయక్
- ధేవూర్ శ్రీ చింతామణి
- లేన్యాద్రి శ్రీ గిరిజాత్మజ
- ఓఝర్ విఘ్నేశ్వరుడు
- రంజన్గాం శ్రీ మహాగణపతి
వినాయకుని స్వరూపములోని ఆంతర్యము
వినాయకుడు గజముఖుడు, ఏనుగుతలను శిరస్సుగా కలవాడు, లంబోదరుడు, అనగా చాలా పెద్దఉదరముకలవాడు, మూషికవాహనుడు, ఎలుకను వాహనముగా గలవాడు.- ఏనుగు శిరస్సు - వివేకమునకు చిహ్నము,
- తొండము - ఓం కారమును సూచించును.
- ఉదరము - సమృద్ధికి ప్రతీక.
- మూషికము - కుశాగ్రబుద్ధిని తెలియ చేయును.
గణేశ పురాణము
వేదవ్యాసులవారు అష్టాదశపురాణములను, అష్టాదశ ఉపపురాణాలను రచించిరి. ఈ ఉపపురాణములలో శ్రీ గణేశ పురాణము ఒకటి. గణేశుని స్మరణమాత్రముచేతనే విఘ్నములు పూర్తిగా తొలిగిపోయి, మనోభీష్టసిద్ది సకల కార్యసిద్ధి కలుగును. గజాననుడు భక్తవత్సలుడు, ప్రణవ స్వరూపుడు, నిత్యసత్య స్వరూపుడు. గణేశ పురాణమును బ్రహ్మ వ్యాసులవారికి ఉపదేశించారు. ఆయన భృగువునకూ, భృగుమహర్షి సోమకాంత మహారాజునకు ఉపదేశించారు. గణేశ పురాణము, భృగు సోమకాంత సంవాదముతో ప్రారంభమగును.పూర్వము నైమిశారణ్యములో శౌనకాది మునులు లోక కళ్యాణార్థము పన్నెండు సంవత్సరముల సత్రయాగాన్ని తలపెట్టారు. అచ్చటకు సూత మహాముని కూడ వచ్చారు. సూతులవారిని శౌనకాది మహామునులు కోరగా, ఆతడు ఈ గణేశపురాణమును వారికి వినిపించెను. మన ప్రాచీన సంప్రదాయములో పగటిపూట యజ్ఞయాగాదులు చేయుచూ, సాయంకాలము భగవత్కథా శ్రవణం చేసేవారు. ఈ విధంగా నిద్రలేచినప్పటి నుండియు రాత్రిపరుండు వరకు, రోజంతా భగవద్భక్తితో గడిపేవారు. వినాయకునికి గణాధిపత్యము వచ్చిన చోటు గిరిజాత్మజ క్షేత్రం- లేన్యాద్రి పరమేశ్వరుని ఉపదేశానుసారము పార్వతీదేవి పుత్రాపేక్షతో 12 సంవత్సరములు గణేశమంత్రమును జపించెనని శ్రీమోరేశ్వర్ కు సంబంధించిన పురాణకథలో ఉన్నది. పార్వతీదేవి ఈ విధముగా తపస్సు చేసిన స్థానమే ఈ లేన్యాద్రి పర్వత శిఖరము.
గణేశ ఆవిర్భావము
ఒక భాద్రపద శుద్ధ చతుర్థినాడు, తలస్నానము చేయుటకు ముందుగా పార్వతీదేవి తనయొంటినుండి తీసిన నలుగుపిండితో విఘ్నేశ్వరుని విగ్రహము చేసి, పూజించెను. ఆ పూజకు, తపస్సునకు సంతసించి, విఘ్నేశ్వరుడు బాలుని రూపమును ధరించి అవతరించెను. తరువాత 15 సంవత్సరములు పార్వతీమాతతో అక్కడే యుండి తనబాలలీలను ప్రదర్శించెను. బాలగణపతిని చంపుటకై సింధురాసురుడు పంపిన చాలామంది రాక్షసులను హతమార్చెను. క్రూరాసుర, బాలాసుర, వ్యోమాసుర, కుశలాసుర, ఇంకను మొదలైన పెక్కు మంది రాక్షసులు బాలగణపతిచే చంపబడినారు.విశ్వకర్మ లేన్యాద్రిని సందర్శించి, 6 సంవత్సరములవయస్సులోనున్న గణపతిని పూజించి అతనికి పాశము, పరశువు, అంకుశము, కమలములను అర్పణచేసాడు. బాలగణపతి యొక్క 7వ సంవత్సరమున గౌతమమహాముని అతనికి ఉపనయమును చేసెను. తరువాత, పరమేశ్వరుడు గణపతికి విఘ్నాధిపత్యమును ప్రసాదించెను. అప్పటినుండి అతడు విఘ్నేశ్వరుడాయెను. పార్వతి, గిరి రాజకుమార్తె, ఆత్మజుడు అనగా తనయుడు. గిరిజాత్మజుడు అనగా పార్వతీ తనయుడు. కనుక, ఇచ్చట వినాయకుని పేరు "గిరిజాత్మజుడు" అయినది.
లేన్యాద్రి పర్వతము పూణే జిల్లాలో జన్స్టర్ తాలూకాలో, గోలేగామ్ అనే గ్రామమునందున్నది. ఇది పూణేకు 94 కిలోమీటర్ల దూరమున ఉన్నది.