లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
చాముండేశ్వరి శక్తి పీఠం పురాణగాధ
చాముండేశ్వరీ శక్తి పీఠానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి.. పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకల లోకాలను పీడించాడు. ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులకు లోనైన సకల లోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, వారు మహిషాసుర సంహారం కోసం స్త్రీశక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది.ఒక ప్రళయంలా ఆ శక్తి స్వరూపం మహిషాసురుడి పై విరుచుకుపడి వాడిని సంహరించింది. ఆ తరువాత దేవతల కోరిక మేరకు ఆమె అక్కడే 'చాముండేశ్వరీ దేవిగా' వెలసింది. ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంది.
చాముండేశ్వరి ఆలయం సమీపంలో అతి ప్రాచీన నంది విగ్రహం
చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం కనిపిస్తుంది. ఆ ఆలయ గోపురం ఏడు అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు. ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం. ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచబడిన 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు కలిగిన నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది.ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైంది. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన, ఆశించిన రంగంలో విజయం చేకూరుతుందని అంటారు.