హరిద్వార్
పంచప్రయాగలు లో హరిద్వార్ ప్రాంతం పవిత్ర గంగానదీ తీరంలో చార్‌ధామ్ యాత్రకు ఇది సింహద్వారం వంటిది. ఈ హరిద్వార్‌ను శివభక్తులు 'హరద్వార్' అని కూడా పిలుచుకుంటారు. అందుకే ఈ హరిద్వార్‌ను ''గేట్ ఆఫ్ ద లార్డ్''(భగవంతుని చేరేందుకు సింహద్వారం) అని పిలుస్తారు. సాగరమధనం తర్వాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాల్లో చిందినట్లు పురాణాలు చెప్తున్నాయి. వాటిలో హరిద్వార్ ఒకటి. ఇక్కడ ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి గంగానదికి జగత్ప్రసిద్ధమైన కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా ప్రతీ మూడు సంవత్సరాల వ్యవధిలో నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. అది హరిద్వార్‌తో పాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్. కుంభమేళా సమయంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హరిద్వార్ చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు చేసి పాప విముక్తులౌతారు. ఈ యాత్రాస్థలం సప్తవర్ణ శోభితమై నిత్యం వర్థిల్లుతూ ఉంటుంది.రిషీకేష్
ఉత్తరాఖండ్‌లో మరొక దివ్యమైన ప్రశాంతమైన తీర్థయాత్రాస్థలం రిషీకేష్. ఇది సముద్ర మట్టానికి 356 మీటర్ల ఎత్తులో ఉన్న క్షేత్రం. గంగానది ఈ పుణ్యక్షేత్రం మీదుగా ప్రవహిస్తుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, వాటిని చుట్టుముట్టిన దట్టమైన అడవులతో నిత్య శోభితంగా ఉండే ఈ క్షేత్రం వందల సంవత్సరాల నుంచీ హిందువుల దివ్యధామంగా విలసిల్లుతోంది. హరిద్వార్‌కు రిషీకేష్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీమహావిష్ణువు తపస్సు ఆచరించిన ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రముఖ యాత్రాస్థలమైంది.శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడ పరిహార కర్మలను ఆచరించినట్టు పురాణ కథల ఆధారంగా తెలుస్తోంది. గంగానది శివాలిక్ పర్వతాలను దాటి ఉత్తర భారతదేశంలో అడుగుపెట్టిన ప్రాంతంగా కూడా రిషీకేశ్‌కు ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతంలోని గంగానదీ తీరంలో అనేక పురాతన దేవాలయాలున్నాయి. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ప్రముఖమైన యాత్రాస్థలి. ఇక్కడ యోగశిక్షణా కేంద్రం ఉంది. ఈ నగరాన్ని యోగా నగరం అని విదేశాల్లో పేర్కొంటారు. గంగానదిలో స్నానం, రిషీకేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి.
జగేశ్వర్
జగేశ్వర్ అనేది ఉత్తరాఖండ్‌లో మరొక ప్రసిద్ధిచెందిన యాత్రాస్థలం. అనేక ఆలయాలకు ఆలవాలమైన అటవీప్రాంతం. ఉత్తరాఖండ్‌లోని మిగిలిన యాత్రాస్థలాలన్నింటికంటే జగేశ్వర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సుమారు 124 శివునికి అంకితమైన దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇదో పెద్దా చిన్నా ఆలయాల సమూహం. అన్నింటి కన్నా ముఖ్యమైనది ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఎనిమిదవ క్షేత్రం. సముద్ర మట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం అల్మోరా జిల్లాలో ఉంది.ఈ క్షేత్రం జత గంగానదీ ఒడ్డున ఒక లోయలో కనిపిస్తుంది. చుట్టూ పచ్చికబయళ్ళు, దట్టంగా అలుముకున్న దేవదారు వృక్షాలతో నిండి మనసుకు ప్రశాంతత కల్పిస్తుంది. మనలోని ఆధ్యాత్మిక చింతనను తట్టి లేపుతుంది. ఇక్కడి ప్రధాన ఆలయం జగేశ్వర్ మహాదేవ ఆలయం. దీనినే 'నగేశ్ జ్యోతిర్లింగ' అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే మిగిలిన ఆలయాల్లో దందేశ్వర ఆలయం, చండికా ఆలయం, మహా మృత్యుంజయ ఆలయం, కుబేర ఆలయం, నవగ్రహ ఆలయం, ఇంకా నందాదేవి ఆలయం ప్రముఖమైనవి. జగే శ్వర్‌లోని ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న పురావాస్తు మ్యూజియం తొమ్మిదవ శతాబ్దం నాటి శిల్ప కళలను మనకు పరిచయం చేస్తుంది.
ఉత్తరాఖండ్‌లో కొనసాగే మరో ముఖ్యమైన సందర్శన, మనకు పుణ్యలోకాలను ప్రాప్తింపచేసే యాత్ర చార్‌ధామ్. వందల సంవత్సరాలుగా హిమాలయాల్లోని చార్‌ధామ్ యాత్రా ప్రాంతాలుగా భాసిల్లుతున్నాయి గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్. ఇవన్నీ హిమాలయ పర్వత శ్రేణుల్లోని గర్హ్వాల్ రీజియన్‌లో ఉన్నటువంటి యాత్రా స్థలాలు. ఈ నాలుగు ప్రాంతాలు నాలుగు నదులకు పుట్టి నిల్లులుగా భాసిల్లుతున్నాయి. యమునోత్రి యమునానది, గంగోత్రి భాగీరధీనది, కేదార్‌నాద్ మందాకినీ నది, బదరీనాధ్ అలకనందా నదీ తీరంలోనూ ఉన్నాయి. ఈ ఆలయాలను పడమరనుంచి తూర్పు దిశగా ప్రయాణిస్తూ యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాధ్ చివరిగా బదరీనాధ్‌లను సందర్శిస్తారు.
యమునోత్రి
గర్హ్వాల్ పర్వతశ్రేణుల్లో పశ్చిమదిశగా ఉన్న ప్రాంతం యమునోత్రి. ఇక్కడ యమునాదేవి ఆలయం చూడాల్సిన ప్రదేశం. ఈ ఆలయాన్ని గర్హ్వాల్ మహారాజు నిర్మించాడన్నది స్థానికుల కథనం. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉష్ణకుండం అనే ఒక కొలను ఉంటుంది. ఇందులో ఎముకలు కొరికే సమయంలో కూడా నిత్యం వేడినీరు ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ కొలనులో స్నానం చేసిన అనంతరం గర్భగుడిలో ఉన్న యమున, సరస్వతి, గంగా మూర్తులను దర్శించుకుంటారు. దర్శనానంతరం యాత్రీకులు బియ్యాన్ని మూటల్లో కట్టి ఉష్ణకుండంలో ముంచి ఉడికించి అన్నం తయారుచేసుకుంటారు. దీన్ని ఆహారంగా స్వీకరించకూడదు. ఎందుకంటే నీటిలో ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. కేవలం నీటిలోని వేడిని తెలుసుకునేందుకు మాత్రమే ఇలా చేస్తారు.గంగోత్రి
గంగానది పుట్టిన ప్రదేశంగా గంగోత్రి హిందువులకు పవిత్ర దర్శనీయ స్థలమైంది. చార్‌ధామ్ యాత్రలో రెండవ దర్శనీయ ప్రాంతమిది. ఇక్కడ గంగానదిని భాగీరధిగా పిలుస్తారు. ఎందుకంటే పురాణాల ప్రకారం గంగానదిని భూమిమీదకు తీసుకురావడానికి భాగీరధుడు కారణం కాబట్టి ఆ పేరు వచ్చింది. వాస్తవంగా గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇక్కడ గంగాదేవిని ప్రతిష్ఠించారు. ఇది గంగోత్రికి 40 కిలోమీటర్ల దూరంలోని పర్వతాల్లో ఉంది. గంగోత్రి వద్ద విస్తరించి భాగీరథిగా మారుతుంది. గంగోత్రి ప్రాంతం సముద్రమట్టానికి 4042 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ యాత్ర ఆద్యంతం ఉత్కంఠతోనే కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలోని ఒక నగర పంచాయితీయే గంగోత్రి.కేదార్‌నాధ్
కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3581 మీటర్ల ఉన్న చార్‌ధామ్ క్షేత్రాల్లో మూడవ క్షేత్రం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఇది ఒక నగర పంచాయితీ. ఇది మందాకినీ నదీ తీరంలో గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ఇది ఒక పవిత్రమైన శైవక్షేతం. అక్షయతృతీయ నుండి దీపావళి వరకూ మాత్రమే యాత్రలను అనుమతిస్తారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. చుట్టూ మంచు కప్పిన కొండలు, పర్వత శిఖరాల నుంచి జాలువారే జలపాతాలు వంటి సుందర దృశ్యాలు ఈ ఆలయ ప్రాంతంలో మనల్ని కనువిందు చేస్తాయి. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయంలో కేదారేశ్వరుడు స్వయంభువుగా దర్శనమిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధంలో సగోత్రీకుల హత్యాపాతకం నుంచి బయటపడేందుకు శివునికోసం గాలిస్తూ పాండవులు ఇక్కడకు చేరుకుంటే పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు శివుని వెతుక్కుంటూ వచ్చి ఆయన వెనుక భాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి. పాండవులు కుంతీ సమేతంగా శివుని ఇక్కడకు వచ్చి పూజించారు కాబట్టి వారి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ నిత్యం హిమపాతం సంభవిస్తూ ఉంటుంది. అయినా లెక్కచేయకుండా ముందుగా యాత్రికులు ఇక్కడి పర్వత శిఖరాన్ని చేరుకుని తరువాత ఆలయాన్ని దర్శిస్తారు.
బదరీనాధ్
బదరీనాధ్ పుణ్యక్షేత్రం ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. శ్రీమన్నారాయణుడు నరునిగా ఆశ్రమ జీవితాన్ని గడిపిన ప్రాంతంగా బదరీనాధ్ పేరుగాంచింది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న ఒక పంచాయతీ కేంద్రం. గర్హ్వాల్ కొండల్లో అలకనందా నదీ తీరంలో సముద్రమట్టానికి 3033 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ క్షేత్రం రుషీకేష్‌కు 300 కిలోమీటర్ల దూరంలోను, కేదార్‌నాథ్‌కు 230 కిలోమీటర్ల దూరంలోను ఉంది. పురాణాల్లో శివుడు అర్జునునితో పేర్కొన్నట్టుగా చెప్పబడిన కథ ప్రకారం పూర్వజన్మలో అర్జునుడు నరుడుగాను, శ్రీకృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు ఇక్కడ తపోధ్యానంలో గడిపారు.ఇక్కడ బదరీనాధుని ఆలయమే ప్రధాన ఆకర్షణ ఆదిశంకరాచార్యులు తొలుత అలకనందా నదీ తీరంలో తప్తకుండ్ ప్రాంతంలో బదరీనాధుని ప్రతిష్టించగా, 16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు తిరిగి మూర్తిని ప్రస్తుత ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. స్వర్గంలోను, నరకంలోను అనేక పవిత్ర క్షేత్రాలున్నా బదరీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం పద్మపురాణంలో పేర్కొనబడినట్టు తెలుస్తోంది.
పంచ ప్రయాగ ప్రాంతాలు గంగానదీతీరంలో ఉన్న ఐదు ప్రముఖ యాత్రాస్థలాలు. భాగీరథీ నది గంగానదిగా మారే క్రమంలో ఆ నదిలో విలీనమయ్యే నదుల సంగమ ప్రాంతాలే పంచ ప్రయాగలుగా భాసిల్లుతున్నాయి. ఇలా నదులనన్నింటినీ తనలో లుపుకుంటూ దేవప్రయాగ వద్ద భాగీరధి గంగగా ఉరకలేస్తుంది. ఇవి కేవలం ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఆరాధ్య ప్రాంతాలు కూడా. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మనలోని ఆధ్యాత్మిక చింతనకు ఆహ్లాదాన్ని జతచేసి మనసును వికసింపచేస్తాయి.
విష్ణుప్రయాగ
హిమాలయాల్లోని సతోపంత్ అనే ప్రాంతంలో పుట్టిన అలక నందానది బదరీనాధుని పాదాలను స్పృశించుకుంటూ ప్రవహిస్తూ చిన్న చిన్న హిమనీనదాలను తనలో కలుపు కుంటూ జోషీమఠ్ అనే ప్రాంతంనుంచి 12 కిలో మీటర్లు ప్రవహించి విష్ణుప్రయాగ దగ్గర ధౌళీగంగలో కలిసి అలక నందా నదిగా దిగువకు ప్రయాణం సాగిస్తుంది. ధౌళిగంగ హిమాలయాల్లో నితిపాస్ అనే ప్రాంతంలో పుట్టి విష్ణుప్రయాగ దగ్గర అలకనందలో కలిసి అంతర్ధానమవుతుంది. తెల్లని రంగులో ఉండే ధౌళీగంగ, నీలం రంగులో ఉండే అలకనంద సంగమ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నారదుడు ఈ ప్రదేశంలో ఘోర తపస్సు చేయగా విష్ణుమూర్తి దర్శనభాగ్యాన్ని లుగచేసిన ప్రాంతం కాబట్టి విష్ణు ప్రయాగగా పిలువ బడుతోంది. ఈ ప్రాంతంలో 25 కిలోమీటర్ల మేర నదిని విష్ణుగంగగా పేర్కొంటారు.నందప్రయాగ
విష్ణుప్రయాగ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నందప్రయాగ వస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి పూర్వం ఇది యదువంశ రాజున ముఖ్యపట్టణంగా ఉండేదని తెలుస్తోంది. నందప్రయాగ అనేది రుషీకేష్, బదరీనాధ్ రహదారిలో మనకు కనిపిస్తుంది. అలకనందా నది నందాదేవి అభయారణ్యంలోని నందగుంట వద్ద పుట్టిన నందాకిని నదితో కలిసే ప్రదేశమిది. నందానదిని తనలో లుపుకుని గంగ అలకనందగానే దిగువకు ప్రవహిస్తుంది. ఈ సంగమ ప్రాంతంలో కూడా వేర్వేరు రంగుల్లో ఉన్న నదీజలాల కలయిక సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నందుడు విష్ణుమూర్తి గురించి యాగం చేసి ఆయననే తన కుమారుడు శ్రీకృష్ణునిగా పొందిన ప్రాంతంగా ఖ్యాతికెక్కింది. ఇక్కడ ఒక చిన్న ఆలయంలో బాలకృష్ణుని పూజలు నిర్వహిస్తారు. శకుంతలా, దుష్యంతుల వివాహం జరిగిన ప్రాంతంగా కూడా వాసికెక్కింది.కర్ణప్రయాగ
నందప్రయాగకు కర్ణప్రయాగ సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిమాలయాల్లోని భాగేశ్వర్ అనే ప్రాంతం దగ్గర పిండారీ హిమనీనదంలో పుట్టిన పిండారిగంగ అలకనందతో సంగమించే ప్రదేశమే కర్ణప్రయాగ. ఇక్కడ నిర్మించిన ఒక వంతెనపైనుంచి నదుల సంగమాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. సంగమ ప్రదేశానికి కొద్ది దూరంలో చిన్న దుర్గాదేవి మందిరం, అక్కడే కర్ణుని సమాధి కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కొండపై కర్ణుడు తపస్సు చేసుకున్న ప్రాంతం కనిపిస్తుంది. కర్ణుడు సూర్యభగవానుని కోసం తపస్సు చేసి కవచకుండలాలు పొందిన ప్రదేశం ఇదే అని పురాణాలు చెప్తున్నాయి. వివేకానందుడు తన గురువులైన తురియానందజీ, అఖరానందజీ లతో కలిపి ఇక్కడే 18 రోజులపాటు తపస్సు చేశారని తెలుస్తోంది.రుద్రప్రయాగ
కర్ణప్రయాగ నుంచి సుమారు 32 కిలోమీటర్లు ప్రయాణించి రుద్రప్రయాగకు చేరుకోవచ్చు. కేదార్‌నాథ్ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో చోరాబారీ అనే హిమనీనదం నుంచి పుట్టిన మందాకినీ నది అలకనందా నదితో రుద్రప్రయాగ దగ్గర సంగమిస్తుంది. ఇది చాలా లోతుగా ఉంటుంది. చూసేందుకు వెయ్యి కన్నులు చాలవన్నట్టుగా ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది. మెట్లు దిగి సంగమ ప్రాంతానికి వెళ్ళేందుకు వీలుంటుంది. ఈ దారిలో నారదశిల మనకు కనిపిస్తుంది. నారదుడు శివునికోసం తపస్సుచేసి శివుని వద్ద ఇక్కడే సంగీతం నేర్చుకున్నాడని పురాణగాధలు చెప్తున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడు రుద్రనాధుడుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. రుద్రప్రయాగ పరిసరాల్లో ఒక గుట్టపై చాముండాదేవి ఆలయం, మరోపక్క గుహలో కోటిలింగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు.దేవప్రయాగ
మిగిలిన నాలుగు ప్రయాగ క్షేత్రాలతో పోలిస్తే దేవప్రయాగ ఆధ్యాత్మిక కేంద్రంగాను, పర్యాటక క్షేత్రంగాను ప్రముఖంగా నిలుస్తుంది. నదుల సంగమానంతరం గంగగా గంగానది తన స్వరూపంతో ముందుకు సాగే ప్రాంతమిది. అలకనందానది భాగీరధిలో సంగమమై గంగగా అవతరించిన పుణ్య ప్రదేశం. ఇక్కడ తొండేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. ఇక్కడ నదుల సంగమాన్ని అత్తాకోడళ్ళ సంగమంగా కూడా స్థానికులు పిలుస్తారు. అలకనందాదేవి మహాలక్ష్మీ స్వరూపమని, భాగీరధి స్వయంగా శివుని పత్ని అని భావిస్తారు.అత్తాకోడళ్ళ మధ్య తగువులు ఎక్కువగా ఉన్నవారు ఒక్కసారి ఈ ప్రాంతాన్ని దర్శిస్తే చాలు ఇష్టులైపోతారన్నది ఈ ప్రాంతవాసుల నమ్మకం. రుద్రప్రయాగ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి దేవప్రయాగకు చేరుకోవాలి. పూర్వం దేవశర్మ అనే మహాముని ఈ ప్రదేశంలో తపస్సు చేశారని, అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని పేర్కొంటారు. మరో కథ ప్రకారం దేవతలందరూ కలిసిన చోటని అందుకే దాన్ని దేవ ప్రయాగగా పిలుస్తారని పేర్కొంటారు. దేవప్రయాగ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రముఖ దేవాలయాలు, దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి.