తిరుమల లో మంగళవారంనాడు ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ 16 ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. భక్తులందరూ శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఉట్లోత్సవం, ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత హథీరాంజీ మఠానికి, కర్ణాటక సత్రాలు తదితర ప్రాంతాల్లో ఉట్లోత్సవం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు.
Source