షోడశ గణపతులు: వినాయకుని రూపాలు ఎన్ని? వాటి విశిష్టతలు ఏమిటి?

విఘ్నాధిపతి అయిన వినాయకుని 16 రూపాల్లో పూజిస్తుంటాం. నిజానికి వినాయకునికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

బాల గణపతి


ఈ వినాయకుని రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్ ||


అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

తరుణ గణపతి


ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః


ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః||


అనే మంత్రంతో పూజించాలి.

భక్త గణపతి


ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్ ||


అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

వీరగణపతి


ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి ||


అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు ఆ స్వామి.

శక్తి గణపతి


నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,  విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే  ||


అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. .



ద్విజ గణపతి


ఈ వినాయకుని రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః  ||


అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

సిద్ధి (పింగల) గణపతి


ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల ||


అనే మంత్రంతో స్తుతించాలి.

ఉచ్ఛిష్ట గణపతి


కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః ||


అనే మంత్రంతో ప్రార్థించాలి.

విఘ్న గణపతి


గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః ||


అనే మంత్రంతో ప్రార్థించాలి.

క్షిప్ర గణపతి


ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్ ||


అనే మంత్రంతో స్తుతించాలి.

హేరంబ గణపతి


ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా ||


అనే మంత్రంతో స్తుతించాలి.

లక్ష్మీ గణపతి


ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్


అనే స్తోత్రంతో పూజించాలి.

మహాగణపతి


ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతాయి.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం


శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్


బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల


వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే ||


అనే మంత్రంతో ప్రార్థించాలి.

విజయ గణపతి


సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....

పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః ||


అనే మంత్రంతో పూజించాలి.

నృత్య గణపతి


సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్


అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

ఊర్ధ్వ గణపతి


కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య


గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః


అనే మంత్రంతో ఈ వినాయకుని స్తుతించాలి.