అనంత పద్మనాభస్వామి వ్రతం: అనంతుని పూజించండి...అనంత ఫలితాలు పొందండి

అనంత పద్మనాభ స్వామి వ్రతాన్నిఅనంతమైన ఫలాలు సంప్రాప్తించడం కోసం  ఆచరిస్తారు. అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు.

అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు నిర్వహించాలి. కామ్య సిద్ధి కోసం చేసే వ్రతాలలో కెల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రధానమైనదిగా హిందూ సంప్రదాయంలో ఉన్న వ్రతగ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సంపదలు చేకూరడంతో పాటుగా కష్టాలలో ఉన్నవారు కూడా బయట పడడానికి తరుణోపాయంగా ఉపయోగపడుతుంది. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. సెప్టెంబరు 23న అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించాలి.

అనంత పద్మనాభ స్వామి వ్రత విధానం


భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయాన్నే నదీ తీరమునకు వెళ్ళి గాని లేదా ఇంటివద్ద గాని సంకల్పము చెప్పుకుని స్నానము చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రములు కట్టుకుని పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ముందుగా పూజాస్థలములో గోమయముతో అలికి, పంచవర్ణాలతో ముగ్గులు పెట్టాలి. దానిపై అనంత పద్మనాభస్వామిని ఆవాహనము చేయడానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేసి దానిపై ముగ్గులు వేసి దానిపై కొత్త వస్త్రాన్ని వేసి దానిపై బియ్యం పోయాలి. ఆ పీఠంపై అనంత పద్మనాభ స్వామిగా భావించి నీరు నింపిన కలశం ఏర్పాటు చేయాలి. దీనితోపాటు దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి ప్రతిమను ప్రతిష్టించాలి.

ananta vratam

అనంత పద్మనాభ వ్రతం ఎలా చేయాలి?


అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రారంభించడానికి ముందుగా మహాగణపతి ఆరాధన చేసి ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించిన తరువాత పద్మనాభస్వామిని ఆరాధించాలి. దర్భలతో చేసి పీఠంపై ఏర్పాటు చేసిన ప్రతిమను అనంత పద్మనాభ స్వామిగా భావనచేసి ఆవాహన చేయాలి. ఇందుకోసం ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. దంపతులు ఇరువురూ కలిసి ఈ పూజ చేసుకోవాలి. అనంత పద్మనాభ స్వామిని షోడశోపచారాలతో పూజించాలి. తరువాత తోరాలకు పూజచేయాలి. మన శక్తిమేర పిండివంటలు తయారు చేసి నివేదించాలి. తోరాలు చేతికి కట్టుకుని అనంతపద్మనాభుని వ్రత కథ చదువుకుని అక్షతలు తలపై ధరించాలి. ఇలా పద్మనాభ వ్రతాన్ని నిష్ఠతో ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.

ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణ వచనం.

అనంత పద్మనాభ స్వామి వ్రత కథ


కృతయుగములో సుమంతుడు , దీక్ష అనే దంపతులు ఉండేవారు . వారికి " శీల " అనే కుమార్తె కలిగింది. శీల పుట్టిన కొంతకాలానికి దీక్ష మరణించడముతో సుమంతుడు " కర్కశ " అనే మహిళని వివాహము చేసుకున్నాడు. శీలను సవతితల్లి కర్కశ అనేక కష్టాలకు గిరిచేసింది. ఒక సారి కౌండిన్య మహర్షి సుమంతుని ఇంటికి వచ్చి శీలను చూసి సుమంతుని అనుమతితో శీలను వివాహము చేసుకున్నాడు. శీలను వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి బయలు దేరాడు. కౌండిన్య మహర్షి మధ్యాహ్న సమయానికి నదీ తీరానికి చేరి విశ్రమించాడు . ఆ సమయములో నదీతీరములో కొందరు స్త్రీలు ఏదో వ్రతము చేస్తూండడము గమనించిన శీల వారి దగ్గరికెళ్ళి - దానిని గురించి తెలుసుకొని వారి సహాయము తో శీల కూడా ఆ వ్రతాన్ని ఆచరించి, చేతికి తోరమును ధరించి, భర్తతో కలిసి సాయంత్రానికి ఆశ్రమానికి చేరుకుంది. ఈ విధముగా అనంతవ్రతాన్ని ఆచరించిన ఫలితము గా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించాయి.

కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భార్య శీల చేతికి ఉన్న తోరమును గమనించి " ఏమిటిది ? నన్ను వశపరచుకోవడానికి కట్టుకున్నావా? " అని కోపముగా ప్రశ్నించాడు. భర్త కోపావేశాన్ని చూసి భయపడిన శీల, తను చేసిన అనంత వ్రతము గురించి వివరించింది . ఐతే కౌండిన్యుడు ఆ మాటలను లెక్క చేయక శీల చేతికి ఉన్న తోరమును తెంచి మంటల్లో పడేశాడు . అప్పటినుండి ఆశ్రమం లో దారిద్ర్యం తాండవించసాగింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నములో అనేక రకాల ఆలోచనలు చేసి చివరకు అనంతవ్రతాన్ని ఆక్షేపించడమేనని తెలుసుకొని పశ్చాత్తాపముతో అనంతపద్మనాభస్వామి కోసము అడవికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యములో ... ఒక పక్షి కూడా వాలని ఫలపుష్పాలతో కూడిన మామిడిచెట్టు , పచ్చగడ్డి మేయకుండా తిరుగుతూవున్న ఆవు, పచ్చిక బీడు పై పరుండి వున్న ఎద్దు, కమలాలతో నిండిన సరోవారాలు, గాడిద, ఏనుగులు కనిపించాయి. అనంతుని గురించి వాటిని కౌండిన్యుడు అడిగాడు ..

అవన్ని తెలియవని చెప్పగా కౌండిన్య మహర్షి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆ సమయములో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కౌండిన్య మహర్షి ముందు ప్రత్యక్షమై .. అతనిని ఒక గుహలోనికి తీసుకువెళ్ళి అనంత పద్మనాభ స్వామి గా దర్శనమిచ్చాడు . స్వామిని కౌండిన్యుడు క్షమించమని వేడుకుని ప్రాయశ్చిత్తము చెప్పమని ప్రాధేయ పడ్డాడు . ‘‘ప్రతి సంవత్సరమూ భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంతపద్మనాభ వ్రతము ఆచరించు, ఇలా 14 సం.లు ఆచరించినట్లయితే అన్నికష్టాలు తొలగిపోతాయి’’ అని ఉద్భోధించాడు.

అడవి మార్గం లో కనిపించిన వాటిని గురించి కౌండిన్య మహర్షి స్వామిని ప్రశ్నించగా....నీవు మొదట చూసిన మామిడిచెట్టు పూర్వజన్మలో విద్యావేద విశారదుడగు విప్రుడు. విద్యాదానము చేయక చెట్టుగా పుట్టడం జరిగింది. ఆవు విత్తులను హరించు భూమి, ఎద్దు ధర్మస్వరూపము. పుష్కరిణులు అక్కచెళ్ళెల్లు. పూర్వజన్మలో దానధర్మాలు చేయక ఈ జన్మనెత్తారు. గాడిద క్రోధము, ఏనుగు మదము. నీవు ప్రవేశించిన గుహ సంసారము. వృద్ధుడను నేనే. అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యెను. కౌండిన్యుదు ఆశ్రమానికి చేరి ప్రతి సంవత్సరం వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించసాగాడు. ఫలితముగా ఆశ్రమం తిరిగి అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో నిండింది. ఇలా శాస్త్రోక్తము గా అనంతుడిని పూజించడము వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకము .