శని త్రయోదశి 2018: శనిత్రయోదశి నాడు ఏయే పరిహారాలు చేసుకోవాలి?

మనిషి నడవడికని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు శనీశ్వరుడు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినము. సెప్టెంబరు 22 శనివారం శనిత్రయోదశి.

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమంతుడు, కాలభైరవుడు, శనీశ్వరునికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర. ఆయనది కాశ్యపస గోత్రం. తనను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడు.

శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

భౌతిక దృష్టి లో శని క్రూరునిగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాయాధిపతి లా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

mandapalli-mandeswara-swamy

శని త్రయోదశి - ప్రదోషకాలం


శని త్రయోదశి రోజున ప్రదోషకాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం. ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

క్షీరసాగర మధనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళిన రోజు ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడుట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం. చంద్రుని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం. ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శనికి పరిహారాలు చేయడం ఉత్తమం.

శని త్రయోదశి పరిహారాలు, నియమాలు



  • నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం

  • శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం

  • రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం

  • నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం

  • నల్ల కాకికి అన్నం పెట్టడం

  • నల్ల కుక్కకి అన్నం పెట్టడం

  • నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

  • వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

  • వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం

  • ఎవరివద్ద నుండీ ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోకుండా వుండటం చేయాలి

  • మద్యమాంసాదులను ముట్టరాదు.

  • వీలైనవారు శివార్చన స్వయముగా చేస్తే చాలా మంచిది.

  • నూనె ఒంటికి రాసుకుని, తలస్నానంచేయడం

  • ప్రాణాయామం చేయడం,

  • శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం, నలుని శని పీడించిన కథ పఠిస్తే మంచిది.


శని స్తోత్రాలు


శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు

నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం 

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తూ ఉండడం శ్రేయస్కరం.

ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మన్దః ప్రచోదయాత్ ॥

ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మన్దః ప్రచోదయాత్ ॥

ఓం సూర్యపుత్రాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నః సౌరిః ప్రచోదయాత్ ॥

శనీశ్వర దోషపీడితులు ఈ  శని గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాతఃసమయాన ఎనిమిదిమార్లు జపించవలెను.

ఈ విధం గా శని ని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్య్రం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.