భాద్రపద శుక్ల తృతీయ నాడు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. సంస్కృతంలో ‘హరత్’ అంటే అపహరించడమని, ఆలికా అంటే ‘స్నేహితురాళ్లు’ అని అర్థం. ఆ రోజున పార్వతిని స్నేహితురాళ్లు అపహరించి అంటే మరో చోటికి తీసుకుపోయి ఆమెకు విష్ణువుతో వివాహం కాకుండా ఆపే ప్రయత్నం చేశారని, అందువల్లనే ఈ వ్రతానికి హరితాళికా వ్రతమనే పేరు వచ్చిందని ఒక కథ.
హరితాళికా వ్రతం వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో...
ప్రస్తుతం హరితాళికా వ్రతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆచరణలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరా ఖండ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్‌లలో ఈ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది అంతగా ప్రచా రంలో లేదు. కొన్ని ఇతర ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో ఈ వ్రతాచరణం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్రతంలో భాగంగా పార్వతీ దేవి విగ్రహాన్ని వాహనంలో ఉంచి మేళతాళాలతో ఊరేగిస్తారు. దక్షిణాదిన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో దీనిని ‘గౌరిహబ్బ’ లేక ‘గౌరీగణేష్ పూజ’ అనే పేరుతో చేసే సంప్రదాయం ఉంది.
మంగళ స్వరూపిణి అయిన గౌరీ దేవిని తమకు ఆనంద దాయకమైన వైవాహిక జీవితం ఇవ్వమని కన్నెపిల్లలు కోరుకుంటారు. ఉత్తరాదిలో ఈ వ్రతం నిర్వహించేందుకు వివాహితలు తమ పుట్టింటికి వెళ్ళి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ వ్రతం నాడు మహిళలు ఆభరణాలు ధరించి, కాటుక వంటి ఆలంకరణలతోపాటు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ముఖ్యంగా ధరి స్తారు. కొన్ని చోట్ల మూడు రోజుల పాటు ఉపవాసం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ వ్రతంలో పూజ సాధారణంగా మధ్యాహ్న సమయంలో ప్రారంభిస్తారు. అన్నం కొబ్బరి పాలతో చేసిన ఒక తీపి వంటకాన్ని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లం, అన్నం పొంగలి చేసుకుని దానిని ఆరిటాకులలో పెట్టుకుని తినడం ద్వారా మహిళలు ఉప వాస దీక్ష విరమిస్తారు. ఈ హరితాళికా వ్రత ఉద్యాపన మర్నాడు చేస్తారు.
హరితాళికా వ్రతం విశిష్టత
శ్రమ లేకుండా సంపూర్ణ ఫలమిచ్చే వ్రతం ఏదని పార్వతి అడిగినపుడు శంకరుడు ఈ వ్రతాన్ని ఉపదేశించాడని చెబు తారు. ఈ వ్రతం చేయడం వల్ల సమస్త పాపాలు పోతాయని, గతంలో ఇది చేయడం వల్లనే నువ్వు నన్ను పొందగలిగావు అని కూడా శంకరుడు ఈ సందర్భంగా పార్వతికి చెప్పాడని అంటారు. ఈ వ్రతానికి హరితాళిక అనే పేరు రావడానికి కార ణంగా ఒక కథను చెబుతారు. దాని ప్రకారం హిమవంతుడి కూతురిగా పుట్టిన పార్వతిని నారదుని సూచన మేరకు విష్ణువు కిచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి తలంచాడు. అయితే శంకరుని తన మనసులో నిలుపుకున్న పార్వతీదేవి ఆయనను మినహా ఇతరులను వివాహం చేసుకోబోనని చెప్పింది.
అంతటితో ఆగక వనంలోకి వెళ్లి భాద్రపద శుక్ల తృతీయ నాడు ఇసుకతో లింగాన్ని చేసి పూజించింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని, ఆయన సమక్షంలోనే పార్వతి వ్రత పరిసమాప్తి చేసిందని చెబుతారు. ఈలోగా అక్కడికి హిమవంతుడు రాగా తనను శివునికిచ్చి వివాహం చేయమని ఆమె మళ్ళీ కోరింది. ఆయన అందుకు మొదట అంగీకరించలేదు. దానితో ఆమె స్నేహితురాళ్లు ఆమెను దాచేసి విష్ణువుతో వివాహం కాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హిమవంతుడు అంగీకరించడంతో పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరి గింది. ఇక ఇదే తిథినాడు తెలుగు నాట ఆరు కుడుముల తద్ది అనే నోము కొందరు చేస్తారు.
షోడషోమా వ్రతం
భాద్రపద శుద్ధ తదియనాడు ప్రారంభించి వరుసగా 16 నెలల పాటు శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు గౌరీ పూజ చేసుకునే వ్రతం షోడషోమా వ్రతం. దీని వల్ల సకల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి.