https://www.youtube.com/watch?v=Hh8QZTS4j9Y
భాద్రపద మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే దారిద్య్ర బాధలు తొలగడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పురాణవచనం. ఈ మాసంలో ఉప్పు, బెల్లం దానం చేయడం కూడా విశేష ఫలితాన్నిస్తుంది.
కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం చేస్తారు. శివ, పార్వతులను పూజించడం ద్వారా ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం, జాగరణ చేస్తే ఆడపిల్లలకు కోరుకున్న భర్త లభిస్తాడని చెబుతారు. ఎవరైతే ప్రతీ భాద్రపద మాసంలో ఈ హరితాళికా వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారి జీవితంలో కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని పురాణ కథనం.
భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపతి అయిన వినాయకుని ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ రోజునే మనం వినాయక చవితి జరుపుకుంటాం.
https://www.youtube.com/watch?v=GFFWCLqdsQQ
ఋషిపంచమి వ్రతం
భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది బ్రాహ్మణుడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ అందచేయాలి. వ్రతం చేసుకున్న వారు ఒంటిపూట ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారైనది కాకుండా ఉండాలి. అంటే ఈ పదార్ధాలను ఉపయోగించకుండా తయారు చేయాలన్నమాట. దీని బదులు పలహారం అంటే పలు రకాల పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.
భాద్రపద శుద్ధ షష్ఠిని సూర్యషష్ఠి అని పిలుస్తాం. సప్తమి కలసిన షష్ఠి అంటే సూర్యునికి ఎంతో ప్రీతికరం. ఈ రోజున సూర్యుభగవానునికి ఆవుపాలు, పెరుగు, నెయ్యి లతో తయారుచేసిన క్షీరాన్నం నివేదన చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి.
భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించాలి. ఈ వ్రతంలో భాగంగా శ్రీమహావిష్ణువు 10 అవతారాలను పూజించాలి. ఇలా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజు పితరులకు తర్పణాలు చేయడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైనవిధులు.
భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి వరివర్తనం చెందుతాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సమాజంలోను, కుటుంబంలోను కరువుకాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజు సంధ్యాసమయంలో శ్రీమహావిష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. ఈ రోజున వామనుని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి పుణ్య ఫలాలు పొందవచ్చు.
భాద్రపద మాసంలో చతుర్దశి అనంతపద్మనాభ చతుర్దశి అంటారు. ఈ రోజున శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువును కమలాలతో పూజిస్తే దారిద్ర్యబాధలు తొలగి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.
భాద్రపద పూర్ణిమరోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తిశ్రద్ధలతో ఈవ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
మహాలయపక్షం
భాద్రపద పూర్ణిమతో మహాలయపక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అంటారు. పితృదేవతలను తలుచుకుంటూ వారికి ఈ రోజున తప్పనిసరిగా తర్పణాలివ్వాలి. పితృదేవదలను తలుచుకుంటూ దానాలు చేస్తే వారి ఆత్మలు శాంతించి వారి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటాయి.
భాద్రపద బహుళ తదియని ఉండ్రాళ్ళతద్దెగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకునే పండుగ, ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి, ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.
భాద్రపద బహుళ ఏకాదశిని అజ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున పితృతర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఇదే రోజున రోజున స్త్రీలు పోలాల అమావాస్య వ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఈ వ్రతాన్ని కొందరు శ్రావణ అమావాస్య నాడు ఆచరిస్తే మరికొందరు భాద్రపద అమావాస్యకు చేస్తారు. ముఖ్యంగా సత్సంతానం కోసం పోలాల అమావాస్య వ్రతం ఆచరిస్తారు.
ఇవీ భాద్రపదమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు.