మంగళగౌరి వ్రతం లో విధిగా పాటించాల్సిన నియమాలు

శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకునేవారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఇందుకోసం ఈ వ్రతం చేసుకునే వారు ముందురోజే సిద్ధంకావాల్సి ఉంటుంది.  ఆ నియమాల గురించి తెలుసుకుందాం.

మంగళగౌరి నోము ముందురోజు ఆచరించాల్సినవి...



  • మంగళవారం రోజున తలంటు స్నానం చేయకూడదు. అందుకే మంగళగౌరి నోము చేసుకునేవారు ముందురోజు అంటే సోమవారమే అభ్యంగనస్నానం చేయాలి. నోము రోజున అంటే మంగళవారం పసుపు రాసుకుని మామూలుగా తలపై స్నానం చేయాలి.

  • మందురోజే ఇంటిని శుభ్రంచేసుకోవాలి. పూజాగదిని మంగళగౌరివ్రతం కోసం సిద్ధంచేసుకోవాలి. ఈశాన్యమూలలో రంగవల్లులు తీర్చిదిద్దాలి. గౌరీదేవిని స్థాపించే పీటను శుభ్రంగా కడిగి ఉంచాలి.

  • మంగళగౌరి నోము కోసం ఉపయోగించే సామాగ్రిని తెచ్చిపెట్టుకోవాలి. మామిడాకులు, అరటిపళ్ళు, రెండు కొబ్బరికాయలు, తెల్ల తువ్వాలు, వాయినాలు ఇవ్వడానికి ఉపయోగించే శనగలు, ఇతర పూజాసామాగ్రి సిద్ధం చేసుకోవాలి. గడపను పసుపు, కుంకుమలతో అలంకరించాలి.

  • తోరాలు తయారు చేయడానికి ఒక తెల్ల దారపు రీలు కూడా తెచ్చిపెట్టాలి. వాటిని ముందురోజు రాత్రి తొమ్మిదేసి పోచలుగా చేసి ఉంచుకోవచ్చు.

  • ముందురోజు రాత్రే శనగలు నీటిలో వేసి దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి నానబెట్టుకోవాలి. ఆరోజు రాత్రే చలిమిడి చేయడానికి బియ్యం కూడా నానబెట్టుకోవాలి.

  • వ్రతం చేసుకునే వారు ముందురోజైన సోమవారం నాడు కూడా మాంసాహారం, తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా పనికిరావు.

  • సాయంత్రం ఒక ముత్తయిదువకు కుంకుడుకాయలు, పసుపు, సున్నిపిండి ఇచ్చి ‘‘ శ్రావణ మంగళగౌరి నోము నోచుకుంటున్నాను, వాయినం పుచ్చుకోవడానికి రండి’’ అని బొట్టుపెట్టి పిలవాలి.

  • మంగళగౌరీ నోము ముందురోజు, నోము చేసుకున్న రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి.


మంగళగౌరి వ్రతం రోజున ఆచరించాల్సినవి...



  • మంగళగౌరి వ్రతం రోజున నోము చేసుకుంటున్న వాళ్లు తరిగిన కూరలు తినకూడదు. వ్రతం ముగిసాక అంటే బుట్ట వాయనం అందించే వరకూ ఉపవాసం ఉండాలి.

  • మంగళగౌరీదేవికి నైవేద్యంగా పులగం, పరమాన్నం తప్పనిసరిగా వండాలి.

  • అమ్మవారి పూజలో నైవేద్యం అనంతరం ముందుగా పూజించిన తోరాల్లో నుంచి అమ్మవారికి ఒక తోరం సమర్పించి, తరువాత వాయనం కూడా అమ్మవారికి ఇవ్వాలి.

  • నోము పూర్తయ్యాక బుట్టవాయనం తల్లికి కానీ వేరే పెద్దముత్తయిదువకు కానీ ఇంటివద్దనే అందించాలి. మిగిలిన ముత్తయిదువులకు సాయంకాలంలోగా వాళ్ళఇళ్లకు వైళ్లైనా అందించవచ్చు.  కానీ ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, వాయినాలు అందిస్తే చాలామంచిది.  వాయినాలు ఇచ్చిన తర్వాత ముత్తయిదువుల ఆశీర్వాదాలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.

  • వాయనం చెల్లించడంలో భాగంగా ముందు కాళ్లకు పసుపు రాయాలి, కుంకుమ, గంధం అలంకరించాలి, అక్షతలు చేతికి ఇచ్చి, వ్రతంలో తయారుచేసిక కాటుకను వారికి అందించాలి. తర్వాత వాయనం అందచేసి ఆశీర్వాదాలు తీసుకోవాలి.

  • నోము చేసుకున్న వాళ్లు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.

  • నోము పూర్తయ్యాక నోములో వినియోగించిన చనివిడి దీపాలను పారేయకూడదు, భార్యా భర్తలు వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. దీపాల్లో స్వఛ్చమైన ఆవునేతిని వినియోగించాలి.


బుట్ట వాయనం అంటే...


మంగళగౌరి వ్రతం లో అందించే బుట్ట వాయనం అంటే మనం అందరి ముత్తయిదువలకు అందించాల్సిన వాయనాల సామాగ్రి అంతా కలిపి ముందుగా తల్లికిగానీ లేదా ఒక పెద్దముత్తయిదువకు గానీ అందించాలి. అందులోంచి మళ్లీ ఒక వాయనం విడదీసి బుట్టవాయనం అందుకున్న పెద్దముత్తయిదువకు చెల్లించి, మిగిలిన వాటిని  మిగిలిన ముత్తయిదువులకు ఇచ్చుకోవాలి. బుట్టవాయనం మాత్రం నోము పూర్తియన వెంటనే అందచేయాలి.

ముత్తయిదువను అమ్మవారి ఎదురుగా ఒక పీటపై కూర్చుండబెట్టి  ముందుగా కాళ్ళకు పసుపు రాసి, బొట్టుపెట్టి, అక్షతలు, నోములో కాటుక  ఇవ్వాలి. ఆమెకు తోరం కూడా కట్టాలి. మనం వాయినాలకోసం సిద్ధంచేసిన శనగలు, తమలపాకులు, అరటిపళ్ళు, లడ్డువాలు, మోరుండలు (అంటే చలిమిడితో చేసినవి), పసుపు, కుంకుమ, రవికెలగుడ్డ దక్షిణతో సహా ముందుగా బుట్టవాయినం అందించాలి.

వీటితోపాటు మనం మంగళగౌరి దేవికి నివేదించిన పులగం, పరమాన్నం ఒక ప్లేటులోకి తీసి వాటిని కూడా వాయనంగా అందించాలి. ఇలా చేస్తే నోము ఆ వారానికి సంపూర్ణమైనట్టు అవుతుంది.

లడ్డువాలు, మోరుండలు అంటే...


మంగళగౌరి వ్రతంలో వినియోగించే లడ్డువాలు అంటే చనివిడితో గండ్రంగా చిన్న లడ్డూల మాదిరిగా చేయాలి. మోరుండలు అంటే చినివిడితో కోలగా కాజాల్లాగా చిన్నవిగా చేయాలి. అంటే అంగుళం నుండి రెండంగుళాల పొడవు. వీటి సంఖ్య మనం ముత్తయిదువులకు చెల్లించు వాయనాల సంఖ్యకు సమంగా ఉండాలి. మీరు మొదటి సంవత్సరం నోచుకుంటుంటే ఐదుగురికి వాయనాలు ఇస్తారు కాబట్టి ఐదేసి లడ్డువాలు, ఐదేసి మొరుండులు తయారు చేసుకోవాలి. వీటిని బుట్ట వాయనంతోపాటు పెద్దముత్తయిదువకు అందించాలి. వీటిని మిగిలిన ముత్తయిదువులకు ఇవ్వనవసరం లేదు. వారికి వేరుగా చనివిడి వుండలు వాయనంతో పాటుగా ఇస్తే సరిపోతుంది.

ఈ విధంగా అన్ని నియమాలను పాటించి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులవ్వండి.